Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి. ప్రత్యర్థి నేతలే లక్ష్యంగా విమర్శలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని కడియం శ్రీహరి విమర్శించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
షెడ్డుకు పోయిన కారును తూకానికి అమ్మాల్సిందే : సీఎం రేవంత్‌రెడ్డి - Congress janajathara sabha gadwal
ఖమ్మంలో నటుడు వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్, మాట్లాడే భాషను సరిచేసుకుంటే బాగుంటుందని సూచించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదిత సాయన్న గెలుపు తథ్యమని, ఇది ఓపెన్ చాలెంజ్ అని పేర్కొన్నారు. జహీరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోరుతూ తల్లాడలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రచారం చేశారు. కరీంనగర్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా, సిరిసిల్లలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు మరోమారు అదే పంథాలో ప్రచారం చేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి డిమాండ్ చేశారు.
అప్పులు చేసి పథకాలు అమలుచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదో ఒక రోజు చేతులెత్తేస్తుందని బీజేపీ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు రైతులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ప్రచారం పరుగులు - సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీ - Lok Sabha Elections 2024