TDP Chief Chandrababu Oath Ceremony As AP CM : అందరి సహకారంతో బుధవారం రోజున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ ఎన్డీయే పక్షాల నేతలు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు మోదీ, అమిత్ షా అంగీకరించారని చెప్పారు.
తమకు లభించింది విజయం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి తమపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. శిథిలమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టుకుందామని పేర్కొన్నారు. రేపనేది లేదనట్లు జగన్ అహంకారంతో ప్రవర్తించిన తీరు అందరికీ కేస్ స్టడీ అని అన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దాం కానీ కక్ష, ప్రతీకారాలు మనకొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమిని నమ్మి అధికారాన్ని ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం : అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారని చంద్రబాబు తెలిపారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని, రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారని తెలిపారు. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని గుర్తు చేశారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లామని, ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, సంక్షోభంలో ఉందని, అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు అప్పులపాలయ్యారని, పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితని, కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని, అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని చంద్రబాబు వెల్లడించారు.
మనది వికసిత్ ఆంధ్రప్రదేశ్ : కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కిందని చంద్రబాబు తెలిపారు. ముగ్గురు ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉండే అవకాశం వచ్చిందని అన్నారు. రామ్మెహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు క్యాబినెట్‌లో చోటు కల్పించారని గుర్తు చేశారు. సాధారణ వ్యక్తిగా ఉన్న శ్రీనివాస వర్మకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చినపుడే ఆశ్చర్యం కలిగిందని, ఆ తర్వాత ఆరా తీస్తే పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని తెలిసిందని, సామాన్య కార్యకర్తను గుర్తించిన పార్టీ బీజేపీ అని అన్నారు. టీడపీ, జనసేన కూడా అలా చేస్తున్నాయని, పదేళ్ల మోదీ పరిపాలన దేశప్రతిష్ఠను పెంచిందని కొనియాడారు. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు తీసుకొచ్చిందని, మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగబోతోందని తెలిపారు. మోదీ కల వికసిత్ భారత్- 2047. మనది వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఈ లక్ష్యంతో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.
నా శపథాన్ని ప్రజలు గౌరవించారు : తమకు లభించింది విజయం కాదని ప్రజలకు సేవ చేసే బాధ్యత అని అన్నారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతాననే శపథాన్ని ప్రజలు గౌరవించారని తెలిపారు. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని ఆకాంక్షించారు. పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దామని అన్నారు. అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సీఎం కూడా మామూలు మనిషేనన్న చంద్రబాబు, సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదని తెలిపారు. తన కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబు సూచించారు.
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - మరి మంత్రులు ఎవరో? - AP NEW CABINET MINISTERS List