Revanth Reddy Election Campaign in Nizamabad : రూ.2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ పూర్తిగా చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సీఎం, అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ చేస్తామని అన్నారు.
అదేవిధంగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి బీజేపీ ఎంపీ మోసం చేశారని ఆరోపించారు. ఈ బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ అని లేదని చెప్పారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదన్నారు.
"ఎన్నికల కోడ్ ముగిసిన రెండు, మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 తేదీ లోపల ఈ ప్రాంత చక్కెర కర్మాగారాలను తెలిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస ప్రభుత్వం తీసుకుంటుంది. జాతీయ కాంగ్రెస్ నేతలు సోనియమ్మ, రాహుల్ గాంధీ, ఖర్గేలను ఒప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్‌రెడ్డికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ, మీకోసం కొట్లాడే ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మీది." -రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
సెప్టెంబర్ 17 లోపు చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ : నిజామాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమలు పునరుద్ధరణ గురించి ఆలోచించినట్లు, ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపు నిజాం షుగర్స్ పరిశ్రమ తెరిపించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై బాండు రాసి ఇచ్చి బీజేపీ ఎంపీ అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చక్కెర పరిశ్రమ, పసుపు బోర్డులను జీవన్‌రెడ్డి సాధిస్తారని, అత్యధిక మెజారిటీతో ఆయనను పార్లమెంట్‌కు పంపించాలని ప్రజలను సీఎం కోరారు.
దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలి : పంజాబ్, హర్యానా రైతుల తర్వాత అంత చైతన్యం ఉన్నది ఇందూరు రైతులకే అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి కానీ, మోదీ దేవుడిని, భక్తిని ఓట్లుగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రధానిగా ఉన్న మోదీ మత విద్వేశాలు రెచ్చగొట్టేలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల సంపదను ముస్లింలకు పంచి పెడతారని మాట్లాడటం మోదీకి ఓటమి భయం పట్టుకుందని అర్థమైందన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే మళ్లీ కాంగ్రెస్ గెలవాలని రేవంత్‌రెడ్డి అన్నారు.