Congress Election Campaign in Adilabad : ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని సమగ్రాభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం పడట్లేదని కేసీఆర్ అంటున్నారని అన్న ఆయన, ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా, పంద్రాగస్టులోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేసినట్లు తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని అలాంటి కాంగ్రెస్‌కు అందరూ బుద్ధి చెప్పాలని అన్నారు.
"బలహీనవర్గాల గుండె చప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఒక్కసారి కూడా మహిళకు దక్కలేదు. తొలిసారిగా ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ దక్కింది. ఆదిలాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తెరిపిస్తాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
Minister Seethakka Fires on Narendra Modi : నరేంద్ర మోదీ పేదల నేత కాదని, కార్పొరేట్ కంపెనీల నాయకుడని మంత్రి సీతక్క విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అభివృద్ధి గురించి అడిగితే, అయోధ్యను చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హమీలు కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజల మనిషని అన్నారు. ఇందిరమ్మ ఇంట్లో పుట్టిన బిడ్డనైన తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. తాను బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు.
"ఈ రోజు భారత దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపి కుల వ్యవస్థను, మనుధర్మ శాస్త్రాన్ని, వర్ణ వ్యవస్థను తీసుకువచ్చి మధ్యయుగం నాటి అణిచివేత, అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరగబోతున్న ఎన్నికలు ఇవి. అందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అందరు దీన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావాలి." - సీతక్క, మంత్రి