Lok Sabha Election Campaign In Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు వారాలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి తన స్వస్థలం శాలిగౌరారంలో భారీర్యాలీ నిర్వహించారు. చామలకు మద్దతుగా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
Congress Election Campaign : ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మంత్రి సీతక్క కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున సుడిగాలి ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరపున ఆయన తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వంశీకృష్ణను గెలిపించాలని ఓటర్లను కోరారు.
నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతుగా సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మోదీ, కేసీఆర్ సెంటిమెంట్లతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీమంత్రి జానారెడ్డి ఆరోపించారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళిపై చర్చించారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Campaign In Telangana
జీవన్‌రెడ్డికి మద్ధతుగా మధుయాష్కీ ప్రచారం : నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మాజీ ఎంపీ మధుయాష్కీ ప్రచారం చేశారు. వరంగల్ జిల్లా గిర్నిబావిలో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ హాజరయ్యారు. దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు.
BJP Election Campaign : లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అభ్యర్థులు ముమ్మరం చేశారు. యాదగిరిగుట్టలో భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రోడ్ షో నిర్వహించారు. తనను ఎంపీగా గెలిపిస్తే అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సేవ చేస్తానని విజ్ఞప్తిచేశారు. నల్గొండ లోక్‌సభ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన రైతు సమ్మేళనంలో పాల్గొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ నూతన ఓటర్లతో సమావేశమయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి, కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం : నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డికి మద్దతుగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 నుంచి 14 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.