PM Modi Election Campaign in Vemulawada : కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, తెర వెనుక మాత్రం అవినీతి సిండికేట్ చేస్తారని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన 'ఎములాడ జన సభ'కు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని అన్నారు.
PM Modi Speech At Vemulawada Public Meeting Today : ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే కలుగుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపినప్పుడే కరీంనగర్లో
ఆ పార్టీ ఓటమి ఖాయమైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభావం కరీంనగర్లో మచ్చుకైనా కనిపించట్లేదన్నారు.
"ప్రజల ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చాం. వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం. బీజేపీకి దేశమే తొలి ప్రాధాన్యత. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కుటుంబమే తొలి ప్రాధాన్యత. కుటుంబం వల్ల, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే నినాదంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయి." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
PM Modi Slams BRS And Congress : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, నాణేనీకి బొమ్మ, బొరుసు వంటివని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ రెండూ అవినీతి పార్టీలేనన్న మోదీ వాటిని అవినీతే అనుసంధానం చేస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని రెండు పార్టీలు కాలరాశాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారని కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెట్టి కుటుంబ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పని చేసిందని విమర్శించారు. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ కూడా కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేసిందని మండిపడ్డారు.
"వంశపారంపర్య రాజకీయాలతో కాంగ్రెస్ దోపిడీ చేసింది. మాజీ ప్రధాని పీవీని కూడా కాంగ్రెస్ అవమానించింది. పీవీ పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదు. పీవీని భారతరత్నతో సన్మానించింది బీజేపీ. దేశానికి పీవీ చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. పీవీ కుటుంబంలో 3 తరాల సభ్యులను నిన్న కలిశాను. పీవీ గురించి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం : అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధమని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, తెర వెనుక మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి సిండికేట్‌గా మారుతారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు నమోదైందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చెబుతోందన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు.
'తెలంగాణ నుంచి దిల్లీ వరకు ఆర్ఆర్ ట్యాక్స్‌పైనే చర్చ జరుగుతోంది. దీని గురించి ప్రతి పిల్లవాడికీ తెలుసు. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు మించిపోయాయి. తెలంగాణలోని ఆర్ లూటీ చేసి దిల్లీలోని ఆర్కు ఇస్తున్నారు. ఈ ఆర్ఆర్ ఆటను ప్రజలు గమనిస్తున్నారు. ఐదేళ్లుగా అంబానీ, అదానీ పేర్లు జపం చేసిన కాంగ్రెస్ ఒక్కసారిగా ఆపేసింది. ఎన్నికల ప్రకటన రాగానే అంబానీ, అదానీపై విమర్శలు మానేసింది. అంబానీ, అదానీ జపం మానడం వెనక రహస్యాన్ని కాంగ్రెస్ ప్రజలకు చెప్పాలని' ప్రధాని మోదీ నిలదీశారు.
"కాంగ్రెస్, బీఆర్ఎస్తో ఎంఐఎంకు సత్సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌ను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఐఎంకు లీజుకు ఇచ్చింది. హైదరాబాద్‌లో బలమైన అభ్యర్థిని బీజేపీ నిలబెట్టడం వల్ల ఎంఐఎంకు వణుకు పుట్టింది. ఎంఐఎం గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కృషి చేస్తున్నాయి. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. వారి రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేయాలని మేము చూస్తున్నాం." - నరేంద్ర మోదీ, ప్రధాని