వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు, 300 మంది హత్య: లోకేశ్ - నారా లోకేశ్ శంఖారావం సభ
Nara Lokesh Sankharavam Meeting: వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన రూ.25 వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. హిందూపురంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 7, 2024, 12:37 PM IST
Nara Lokesh Sankharavam Meeting: హిందూపురంలోని జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 26 వేలమంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మంది బీసీలను ఏకంగా హత్యచేశారని మండిపడ్డారు. ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం అని జగన్‌ను ప్రశ్నిస్తున్నానన్నారు.
ప్రజలంతా రెండు నెలలు ఓపిక పట్టండని, దొంగ కేసులన్నీ ఎత్తివేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీసీలకు రావాల్సిన 25 వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెలా 4 వేల రూపాయలు అందించబోతున్నామని తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేశ్, బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
అదే విధంగా ఆదరణ పథకం కోసం 5 వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి పనిముట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం తన కుటుంబాన్ని ఆశీర్వదించిందని, ఎమ్మెల్యేగా బాలకృష్ణ 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైపులైను వేసి హిందూపురానికి తాగునీరు అందించామన్నారు. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను క్యాన్సర్ మాదిరిగా తినేస్తున్నారని విమర్శించారు. టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని అన్నారు.
"జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంకి పరిశ్రమలు తీసుకొస్తాను, నాకు విజన్ ఉంది అని చెబుతున్నారు. ఇక్కడున్న వారంతా ఆలోచించాలి. సొంత చెల్లికి, తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి చేస్తారా అని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందు బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత వారి వెన్నెముక విరగొట్టారు". - నారా లోకేశ్
సైకో జగన్ టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పుతున్నది అందుకే : నారా లోకేశ్
నారా లోకేశ్ శంఖారావం పర్యటనలు : ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం (Nara Lokesh Sankharavam) సభలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజులు పాటు మొత్తం 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి ప్రారంభమైన మలివిడత శంఖారావం పర్యటనలకు నారా లోకేశ్ సిద్ధమయ్యారు.
ముందుగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో నేడు శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారు. నేడు రాత్రికి పుట్టపర్తిలో బస చేస్తారు. 8వ తేదీన పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోను, 9వ తేదీన కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోను, 10వ తేదీన ఉరవకొండ, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లోను, 11వ తేదీన తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారు.
మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? నా మనసు కలచివేసింది: లోకేశ్