Ram charan RRR : దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీని తాజాగా ఓటీటీలో రిలీజ్ చేశారు. అందులో జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
'ఆర్ఆర్ఆర్'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రో సీన్లో వచ్చిన ఓ సన్నివేశం సీజీ వర్క్ కాదని చెప్పారు జక్కన్న. రియల్ అని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'అది CG కాదు- ఒరిజినల్'
మూవీ ప్రారంభంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ పోలీస్ స్టేషన్‌పై దాడికి వచ్చిన చాలా మందిని రామ్ చరణ్ ఒక్కడే ఆపుతాడు. ఈ సీన్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సమయంలో అంతమందిని ఆడ్డుకోవడం అక్కడున్న ఆ పోలీసుల వల్ల కాదు. కానీ, వారిలో ఒకరైన రామ్ మాత్రం అందరినీ చాకచక్యంగా ధైర్యంతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేయకుండా ఆపుతాడు. ఈ సీన్ సినిమాలోని హైలెట్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది.
అదిరిపోయిన సీన్
ఇక చరణ్‌ను చూసి భయపడి, ఆ జనసందోహం అంతా ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంది. ఈ సీన్‌ను చెర్రీ కంటి (EYE) లోపల నుంచి చూపించారు. అయితే ఈ సీన్ నిజానికి మేకర్స్ సీజీ వర్క్ ద్వారా క్రియేట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ, జక్కన్న మాత్రం టాలెంట్ ఉపయోగించి ఆ సీన్ రియల్‌గానే షూట్ చేశారట.
తాజాగా 'ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. అలాగే చెర్రీ కన్నుకు దగ్గరగా కెమెరాను పెట్టి ఆ సీన్‌ను ఎలా తీశారో చెప్పారు. ఇలా డాక్యుమెంటరీలో సినిమా గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను జక్కన్న తెలిపారు.
Big shock for me: It's not CG 😳🔥#RRRBehindAndBeyond #RamCharan pic.twitter.com/hiqHsAyPL6
— BingeWatcherHe (@bingewatcherhe) December 26, 2024
BTS : 'ఆర్ఆర్ఆర్' మూవీని ఇప్పటికే థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆనందించారు. కానీ తెర వెనుక సీన్లను చూడడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే తెర వెనుక సీన్ల గురించి ఇప్పటిదాకా ఎవ్వరూ పెద్దగా వెల్లడించలేదు. కానీ జక్కన్న తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమాకి సంబంధించిన బిహైండ్ సీన్స్‌తో ఏకంగా ఒక డాక్యుమెంటరీనే రిలీజ్ చేసి కొత్త ట్రెండ్‌కు ఒరవడి చుట్టారు.
OTT స్ట్రీమింగ్
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ డాక్యుమెంటరీ రిలీజ్ టైం రానే వచ్చింది. ఇండియా వైడ్‌గా ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 20న పలు థియేటర్లలో విడుదలైంది. గంట 37 నిమిషాల నిడివితో సాగే ఈ డాక్యుమెంటరీలో 'ఆర్ఆర్ఆర్' సినిమాను రూపొందించిన బిహైండ్ ది సీన్స్ కంటెంట్‌కు థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇక ఈ డాక్యుమెంటరీ తాజాగా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్‌లో డిసెంబరు 27న రిలీజైంది. సినిమా కోసం తారక్, రామ్ చరణ్, రాజమౌళి అండ్ టీమ్ ఎంతలా కష్టపడ్డారో ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఇక సినిమా విషయానికొస్తే, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ 2022లో రిలీజై భారీ హిట్ కొట్టింది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.1200+ కోట్లు వసూల్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు.
'RRR' డాక్యుమెంటరీ ట్రైలర్ ఆగయా - మీరు చూశారా?
థియేటర్లలోకి 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ - టికెట్ ధర ఎంతో తెలుసా?