MP Laxman on Phone Tapping Case : అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను మాజీ సీఎం కేసీఅర్ దుర్వినియోగం చేశారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారని మండిపడ్డారు. అరెస్ట్ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఆయన అధ్యక్షతన బీజేపీ ధర్నా నిర్వహించింది.
BJP Wants CBI Probe in Phone Tapping Case : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 మాసాలు అయినప్పటికీ రుణమాఫీ, రూ.5 వందల బోనస్ ఇవ్వలేదని లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి, బీజేపీకి పట్టం కట్టారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారని, అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్న దాన్ని కక్కిస్తామన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
MP Laxman Speech at Dharna Chowk : అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారని ధ్వజమెత్తారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు కేసీఆర్ను అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు.
"దేశ భద్రతకు ముప్పు వాటిళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పూర్తి వివరాలు ఉండకుండా ధ్వంసం చేశామని విచారణలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై దిల్లీ పెద్దల ఒత్తిడి ఉందా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడినని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
TS Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీఎల్ సంతోశ్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే తమ పార్టీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు.