Minister Komati Reddy Venkat Reddy Comments on BRS : లోక్‌సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గత సర్కార్ అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చిందని అన్నారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరామని, ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలని కూడా చెప్పామని వెల్లడించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు.
Komati Reddy Venkat Reddy Fire on BRS : ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు 14 అంతస్థులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఆస్పత్రి స్థలానికి ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. అవినీతి చేయకుండానే ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్‌ను అధికారులు దాఖలు చేశారా అని ప్రశ్నించారు.
రాష్ట్ర సంపద అంతా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం దిల్లీకి వెళ్లిందని విమర్శించారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం మొత్తం మూతపడుతుందని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతలను కార్యకర్తలే వెంటపడి కొడతారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించారని ఆక్షేపించారు. కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.
"అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరాం. ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాం. రాష్ట్ర సంపద అంతా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం దిల్లీకి వెళ్లింది. లోక్‌సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారు. మాకు లోక్‌సభ ఎన్నికల్లో 9 నుంచి 12 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్కి రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ." - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పలేదు : గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తప్ప అభివృద్ధి పెరగలేదని మంత్రి ఆరోపించారు. ఐఏఎస్‌లను అందరినీ పక్కన పెట్టి కేవలం నలుగురినే కేటీఆర్ ప్రోత్సహించారని విమర్శించారు. ఉద్యమకారుడు కేకే మహెందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి కేటీఆరే వెళ్లగొట్టారని విమర్శించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదని, పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బోనస్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు శ్రీధర్ బాబుతో కలిసి విదేశాలకు వెళ్లి వివిధ కంపెనీలతో భేటి కానున్నట్టు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి ఆరోపించారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత బాధ్యత మాజీ మంత్రి కేటీఆర్‌కి ఇస్తే మాజీ మంత్రి హరీశ్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
Komati Reddy Venkat Reddy on Congress Guarantees : నల్గొండ జిల్లాకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మంజూరు చేయిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసిందని మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హోంమంత్రికే సీఎం క్యాంపు కార్యాలయంలోనికి అనుమతి లేదని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. వేసవిలో వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే రైతులకు రూ.1500 కోట్లు పరిహారం చెల్లించామని అన్నారు.