Minister Komati Reddy Fires on KCR : రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్ పొలంబాట పట్టారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటంలేదని దుయ్యబట్టారు. ప్రస్తుత కరవుకు గులాబీ పార్టీ చేసిన తప్పిదాలు, అవినీతే కారణమని మంత్రి ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కోమటిరెడ్డి, ప్రతిపక్ష పార్టీలపై(Opposition Parties) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని మూడు లక్షల నుంచి ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సిరిసిల్లలో నువ్వా నేనో తేల్చుకుందాం- కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్
"రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకటి ఎక్కువైనా రావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక్క సీటు కూడా రాదు. ఎందుకంటే పదేళ్ల అధికారంలో ఉండి ఒక ఇళ్లు స్థలం, రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం వారిది. నాడు ప్రగతి భవన్, ఫామ్హౌస్లకే అంకితమైన కేసీఆర్, నేడు ఎమ్మెల్సీ కవిత మద్యం స్కాం కేసులో అరెస్టై, ఇంక కుటుంబమంతా ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో టాపిక్ డైవర్ట్ చేయటానికి పొలంబాట పేరు మీద పర్యటనలు చేస్తున్నారు."-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదు : రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ కూడా గెలవదని వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం గులాబీ పార్టీని ప్రజలు ఎలా అయితే గద్దె దింపారో, ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Election) తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న కోమటిరెడ్డి, మురుగు జలాలను వేరుచేసి, మూసీ నదిని సుందరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారని స్పష్టం చేశారు.
రైతులు కరవు మూలంగా అప్పుల పాలై ఎవరు చనిపోలేదన్న మంత్రి కోమటిరెడ్డి, ఎవరైనా చనిపోయింటే వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయిన(Crop Loss) మాట వాస్తవమేనని, దానికి అన్నదాతలకు తగిన పరిహారం చెల్లిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. కేసీఆర్ శవరాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై విచారణ చేపట్టి వారిని జైలుకు పంపడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.