Telangana Graduate MLC By Election : లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతా ప్రశాంతంగా ఉంటుందనుకున్న ప్రధాన పార్టీలకు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు పార్టీలు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టిని సారించాయి. ఈ ఎన్నికల బరిలో 52 మంది ఉండగా, ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో మూడు పార్టీలు ఉన్నాయి.
సీఎం రేవంత్ వరుస సమీక్షలు : ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా ఈ స్థానాన్ని ఛేజిక్కించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ మూడు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్‌లకు ప్రచార బాధ్యతలను అప్పగించడమే కాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడమే కాకుండా తాజాగా నకిరేకల్, ఆలేరుల్లో పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు, కార్యకర్తలను కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు.
రంగంలోకి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి : మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్న ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచార వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందగా, ఉమ్మడి జిల్లాల్లోని నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో పార్టీ అధినాయకత్వం సైతం పల్లా రాజేశ్వర్ రెడ్డికే ముఖ్య బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సైతం బుధవారం హైదరాబాద్‌లో పూర్వ జిల్లాల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ స్థానాన్ని మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది.
పాత అభ్యర్థితో బరిలో బీజేపీ : గత ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డినే బీజేపీ ఈసారి కూడా బరిలో నిలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గెలుపు అవకాశాలను బీజేపీ మెరుగు పర్చుకుంది. అలాగే తన వ్యూహాలకు సైతం పదును పెట్టి ఈసారి ఎలాగైనా గెలుపొందాలని చూస్తోంది. ఉమ్మడి నల్గొండ ఇంఛార్జులుగా పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతలను నియమించింది.
మమ్మల్ని తిట్టి మీరెందుకు అప్పులు చేస్తున్నారు? : కేటీఆర్ - KTR Review Meeting on MLC ElECTION