Mahabubnagar MLC Election Results Concern : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపుపై ఎవరిధీమాతో వారే ఉన్నా క్రాస్ ఓటింగ్(Cross Voting) తమ కొంప ముంచుతుందేమోనని అభ్యర్థులు చెందుతున్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ పోటీలో నిలిచారు.
ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, పలువురు కౌన్సిలర్లు ఓటు హక్కు(Right to vote) వినియోగించుకోవాల్సి ఉండగా, ఇద్దరు ఎంపీటీసీలు మినహా 1437 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్‌లో ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాలి. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికి సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారు తొలి రౌండ్‌లో విజయం సాధిస్తారు. ఐతే తొలి ప్రాధాన్యత ఓట్లు తమకు దక్కుతాయోలేదోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
MLC By Poll In Mahabubnagar : 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70 శాతం వరకు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. పోటీలేకపోవటంతో నామినేషన్లు వేసిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నాయరాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ఈసారి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ తప్పలేదు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ - గెలుపు దిశగా పార్టీల కసరత్తులు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. పలువురు బీజేపీ, బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లు హస్తంపార్టీలో చేరడంతో గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలాబలాలు మారాయి.
Mahabubnagar MLC By Election 2024 : ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు రాజకీయ భవిష్యత్, రాజకీయ అవసరాలు దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీకి(Congress Party) మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. 70 శాతంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది తమకు అనుకులంగా ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్థి భావిస్తున్నారు. 200 నుంచి 300 ఆధిక్యంతో తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ మారినా ఆధిక్యం మాత్రం తమకే దక్కుతుందన్న ధీమా బీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతోంది. ఈమేరకు ఎన్నికలకు ముందే పార్టీలు ప్రజాప్రతినిధులతో క్యాంపులను నిర్వహించి సంఖ్యాబలాన్ని అంచనా వేశారు. మెజార్టీ తగ్గుతుందని భావించిన చోట పక్క శిబిరం నుంచి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నలు చేశారు.
లోక్‌సభ ఎన్నికలపై ఎమ్మెల్సీ ఫలితాల ప్రభావం : ఓటర్ల సంఖ్యాబలం విషయంలో ఎవరి అంచనాలు ఎలా ఉన్నా క్రాస్ ఓటింగ్ పైనే విజయవకాశాలు ఆధారపడి ఉంటాయని ఇరు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. మార్చి 28న జరిగిన పోలింగ్‌లో రెండు పార్టీల భవతవ్యం ప్రస్తుతం బ్యాలెట్లో నిక్షిప్తమైంది. ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజీలో జరిగే లెక్కింపులో ఫలితాలు తేలనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఉండనుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది.
ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - 99.86 శాతం పోలింగ్ నమోదు
మహబూబ్‌నగర్‌లో ఎన్నికల హీట్ - ఎమ్మెల్సీ పదవిపై ప్రధానపార్టీల ఫోకస్