Kodandaram on Outsourcing Employees : అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న వారిపై వివక్ష ఉందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. దళారుల కింద వెట్టిచాకిరి చేస్తూ, ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా ప్రొ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ(TPCC Campaign Committee) చైర్మన్ మధుయాష్కీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనా విధానాలు, కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబానికో, బంధువులకో దీని వల్ల లబ్ధి చేకూరుతుంది కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదన్నారు. అందులోనూ కొందరు ఏజెన్సీలుగా రెగ్యులర్‌లో కాకుండా, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సృష్టించిన వ్యవస్థగా దీన్ని అభివర్ణించారు. ఉద్యమకాలంలో కాంట్రాక్టర్ల కోసం మాట్లాడిన కేసీఆర్, కుర్చీ ఎక్కాక ఆ విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'నాకు ఎమ్మెల్సీ ఇవ్వటం ఉద్యమకారులకు ఇచ్చిన గుర్తింపు - బీఆర్ఎస్ నేతల అసహనం అర్థం కావడం లేదు'
"అవుట్ సోర్సింగ్ కింద పనిచేసినపుడు కాంట్రాక్టర్ల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆధారపడి బతకాల్సివస్తుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అంటేనే వెట్టిచాకిరి కింద లెక్క. ఈ దుస్థితి మనందరికీ పోవాలనేదే ఇవాళ తాపత్రయం. పనిలో చేరింది మొదలు ప్రతి మనిషి దగ్గర కొంత మొత్తం తీసుకుంటారు. ఇలా కేసీఆర్ బంధువులకో, మిత్రులకో అది లాభం చేకూరుస్తుంది. అందుకోసమే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ప్రవేశపెట్టారు."-ఆచార్య కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు
Madhu Yashki Goud Fire on BRS : రాజ్యాంగబద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకుల పిచ్చి పరాకాష్ఠకు చేరిందనే విషయం అర్థమవుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు(Six Guarantees) మింగుడుపడక, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయటపెడుతామన్నారు.
ఎమ్మెల్సీ కవిత అవినీతి బయటపడకుండా ఉండేందుకే బీసీ నినాదం : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే రూ.49వేల కోట్ల అవినీతి జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ కవిత గత పదేళ్లలో తాను చేసిన అవినీతి బయటపడకుండా ఉండేందుకే, బీసీ నినాదం(BC motto) ఎత్తుకుందని ఆరోపించారు. అలానే ఏపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్న ఆయన వ్యాఖ్యలపై మధుయాష్కీ ధ్వజమెత్తారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలు జైలు పక్షులని, బెయిల్‌పై బయట తిరుగుతున్నారనే విషయాన్ని గుర్తించుకోవలన్నారు. వారికి దమ్ముంటే కాంగ్రెస్ నాయకుడైన వైఎస్ఆర్ పేరుతో ఉన్న వారి పార్టీ పేరును జగన్ పేరుపై మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మధుయాష్కీ హామీ ఇచ్చారు.
లోక్‌సభ టికెట్ల ఎంపికకు పీఈసీ కమిటీ సమావేశం
సోనియా గాంధీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ - తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని వినతి