KA Paul announced Babu Mohan as Party President : ప్రజా శాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా బాబు మోహన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. హైదరాబాద్‌లో అమీర్‌పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారాని వెల్లడించారు. ఇప్పటికే బాబూ మోహన్‌ను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదన్న ఆయన, అందుకే కాంగ్రెస్‌లో నలుగురు ఎక్నాథ్ షిండేలున్నారని విమర్శించారు.
'అన్ని పార్టీల నుంచి కొన్ని వందల మంది కాల్స్ వస్తున్నాయి. ప్రజలు కోరిక మేరకు 48 రోజులు ఉన్నప్పటికీ ప్రజా శాంతి పార్టీ తరఫున 17 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను బరిలో దించుతాం. 25 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న బాబూ మోహన్‌ను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని అనేక మంది సలహా ఇచ్చారు. ఈ మేరకు మా పార్టీ కోర్ కమిటీలో మేం నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుగా బాబు మోహన్‌ను ప్రకటించాం.'- కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధినేత
KA Paul Comments on Congress : వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మంచి నీళ్లు, సక్రమంగా కరెంట్ ఇవ్వలేక పోతున్నారని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రభుత్వం అప్పుల ఉబ్బిలో కూరుకుపోయిందని, మిగిలిన హామీలు ఎలా నెరవేర్చుతారని ప్రశ్నించారు. ప్రజలకు శాంతి, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ప్రజా శాంతి పార్టీ పాలన రావాలని పేర్కొన్నారు. పాలన్న రావాలి, పాలన మారాలని అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అందుకోసం లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
'తెలంగాణ పక్షాన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం సంతోషంగా ఉంది. నేను ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేశా. బీజేపీ తరఫున కూడా 12 రాష్ట్రాల్లో ప్రచారం చేశా. నా ప్రచారంతో పలువురిని గెలిపించా. ఇప్పుడు కూడా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని తారస్థాయికి తీసుకువస్తా. వరంగల్‌లో నేను తప్పకుండా గెలుస్తా అని నమ్మకం ఉంది.'- బాబు మోహన్, ప్రజా శాంతి రాష్ట్రాధ్యక్షుడు