Amit Shah Comments on Congress and BRS : రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో మునిగిపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఏకతాటిపై నడుస్తున్నాయని, కాంగ్రెస్ నేతలు తెలంగాణను దిల్లీ ఏటీఎంగా మార్చారని ధ్వజమెత్తారు. మజ్లిస్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతున్నాయని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదని దుయ్యబట్టారు. బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
ఇవాళ మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి ప్రసంగించారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తామని, రాష్ట్రంలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని అమిత్‌షా కోరారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మెదక్‌లో కమలం వికసించాలని, బీజేపీ ప్రత్యర్థులను మట్టికరిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. దేశంలో 400కు పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించి మోదీని మరోసారి ప్రధానిని చేయాలని ఆకాంక్షించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు ప్రధాని కృషి చేశారని, కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు ముందుకెళ్తున్నారని తెలిపారు.
'తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి. మెదక్‌లో బీజేపీ ప్రత్యర్థులను మట్టికరిపించి, కమలం వికసించేలా చేయాలి. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉంది. కానీ మజ్లిస్‌కు భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించట్లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మేము నిర్వహిస్తాం'- అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి
Raghunandan Rao on Venkatrami Reddy : అంతకముందు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు బహిరంగ సభలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ధరణీ, ప్రాజెక్టుల పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని రఘనందన్‌రావు ఆరోపించారు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో గులాబీ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని విమర్శించారు.
'మూడు రోజులక్రితం కేసీఆర్ ఓ టీవీ ఛానల్లో ఓ మాట అన్నారు. సున్న లేదా ఒక సీటు వస్తుందని చెప్పారు. వాళ్లకు వస్తుందని చెప్పబోయి బీజేపీకి సున్నా లేదా ఒక సీటు వస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం చేసే వారు కావాలా ? ఎమ్మెల్సీ పదవి కోసం కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వారు కావాలా ఆలోచించాలి'- రఘునందన్‌రావు, మెదక్ బీజేపీ అభ్యర్థి
రాష్ట్రంలో బీజేపీకి 12 కంటే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం : అమిత్‌షా
తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ షా