Harish Rao Slams Govt Over Dengue Deaths : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాల విజృంభిస్తాయని గతంలోనే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిపారు. కానీ తమ మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్లే ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే వైద్యారోగ్య శాఖను కోరినట్టు ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వం తమ సూచనలను పట్టించుకోలేదన్నారు. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంత వేగంగా విజృంభించేవి కావని పేర్కొన్నారు. ఏటా వానాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వం మొదటి నుంచి పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిందని దుయ్యబట్టారు.
Harish Rao On Dengue Fever : ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్కనాడు కూడా ప్రజారోగ్యం పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. దోమల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ లు చేపట్టలేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్దత వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సూచించారు. వైరల్ ఫీవర్స్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం వైరల్ జ్వరాలతో రాష్ట్రం వణుకుతోంది. మరోవైపు డెంగీ వేగంగా విజృంభిస్తోంది. గన్యా, మలేరియా కేసులూ ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. అన్ని దవాఖానాల్లో ఓపీ సగటున 10 నుంచి 30 శాతం వరకు పెరగింది.
కొన్ని చోట్ల అంతకన్నా అధికంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బెడ్లు దొరకడం పేషంట్లకు కష్టంగా మారింది. ఇదే సమయంలో జూనియర్ డాక్టర్లు కోల్కతా ఘటనకు నిరసనగా ఒక రోజు సమ్మె చేపట్టగా, ఆసుపత్రులలో పరిమిత సంఖ్యలో ఉన్న డాక్టర్లకు వచ్చే పేషంట్లతో ఓత్తిడి పెరిగింది. గత ఇరవై రోజుల వ్యవధిలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మంచి పోషకాహారాలు తీసుకోవాలని ప్రజలకు డాక్టర్లు సూచిస్తున్నారు.