Harish Rao Slams BJP : బీఆర్ఎస్పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గతంలో గులాబీ పార్టీపై దుబ్బాక నుంచి ఫేక్ వీడియోలు తయారు చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగడం సబబు కాదని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని, గురువారం రోజున పోలీసు స్టేషన్లో కూడా కేసు పెడతామని తెలిపారు. ఇవాళ సిద్దిపేటలోని గులాబీ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
బీజేపీ చెప్పే అబద్ధాలు, గోబెల్స్ వీడియోలు నమ్మి మోసపోవద్దని హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. గతంలో కూడా దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేయడంతో రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కోరిక మేరకే వెంకట్రామిరెడ్డి పోటీలో నిలిచారని తెలిపారు. కొందరిలాగా డబ్బుకు విలువ ఇవ్వకుండా కేవలం ఆయన ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. వెంకట్రామిరెడ్డికి ప్రజలు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారని, మచ్చ లేని మనిషిని గెలిపించుకోవాలని ఓటర్లను హరీశ్ రావు కోరారు. కొందరు ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే వెంకట్రామిరెడ్డి మాత్రం తన ఆస్తిని పంచి పెడతామంటున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి గడ్డపారలు అవుతాయి : హరీశ్‌రావు - Harish Rao Counter to CM Revanth
టీ తాగుతూ ముచ్చటించారు : అంతకముందు సిద్దిపేట కోమటి చెరువు నెక్లస్ రోడ్డులో సిద్దిపేట వాకర్స్ అసోసియేషన్‌తో కలిసి హరీశ్‌రావు, వెంకటరామిరెడ్డి మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. ఉదయపు నడక కోసం వచ్చిన వారితో కొంతసేపు ముచ్చటించారు. వారితో కలిసి క్రికెట్ ఆడారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం కాంచిట్ చౌరస్తాలోనీ గోకుల్ ఆల్లం ఛాయ్ దుకాణానికి వెళ్లి టీ తాగారు. సిద్దిపేట ప్రజలు కుటుంబంగా భావించే హరీశ్‌రావు ఇలాంటి ఆత్మీయ కలయిక గొప్ప సందర్భంమని అక్కడ వారందరూ అభిప్రాయపడ్డారు.
కోడి కూయకముందే పల్లెల్లోకి నేతలు : మరోవైపు ఎన్నికల ప్రచారానికి ఇంకా 11 రోజులే ఉండటంతో పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధులు వారి అనుచరులు సుడిగాలిలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నందున కోడి కూయకముందే ప్రచారం కోసం పల్లెబాట పడుతున్నారు.
పల్లెల్లో ప్రస్తుతం వరి కోతలు ఉండటంతో రైతులు పొలం బాటపడుతున్న నేపథ్యంలో తెల్లవారక ముందే నేతలు వాలిపోతున్నారు. అభ్యర్థులతో పాటు వీరి అనుచరగణం ఉదయం నుంచే ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నాయకులు ఉదయం నుంచే గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ తమ పార్టీ లేదా అభ్యర్ధి గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.