Jogu Ramanna Comments on CM Revanth Reddy : కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం కాదని రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీఛార్జి చేయడం అమానుషమని, సిగ్గు చేటన్న ఆయన, కేసీఆర్ హయాంలో పదేళ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదని అన్నారు. ప్రభుత్వ చేతకాని తనం వల్లే రైతులకు ఇబ్బందులు వచ్చాయని, రెండు, మూడు రోజుల్లో రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అపుడు ఐపీఎల్ మ్యాచ్లో, ఇపుడు అధికార చిహ్నాలు మార్చడంలో బిజీగా ఉన్నారని, ఆయనకు ఎపుడూ రైతుల గురించి పట్టడం లేదని జోగు రామన్న ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడి సమస్యలు వదిలేసి వేరే రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ మంత్రి రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. రైతులు మళ్లీ కమిషన్ ఏజెంట్లను ఆశ్రయించడమే ఇందిరమ్మ రాజ్యమా, రైతులను ఇబ్బంది పెట్టడమేనా మార్పా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకిి వచ్చాక 250 మంది రైతులు ఆత్మహత్య : కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రైతులు ఆగమయ్యారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రైతుభరోసా పంటలు వేసిన తర్వాత ఇస్తామని వ్యవసాయ మంత్రి చెప్పడం సిగ్గుచేటన్న ఆయన, సీఎంకు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల బాగోగుల మీద లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ రైతుల పట్ల చూపిన శ్రద్ధలో రేవంత్ పది పైసలు పెట్టినా ఇన్ని సమస్యలు వచ్చేవి కావని అన్నారు. రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించిన ఆయన, రైతుభరోసా ఎప్పట్నుంచి వేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఈ పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా విత్తనాల విషయంలో కావొచ్చు, పండించిన పంట కొనుగోలు విషయంలో కావొచ్చు, రైతులకు ఇబ్బందులు రాకుండా చూశాం. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం దుకాణాలకు రైతులు వెళితే వారిపై ఈ ప్రభుత్వం లాఠీఛార్జి చేయడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం'-జోగు రామన్న, మాజీ మంత్రి