BRS MLA Harish Rao On BAC Meeting : హామీలనే కాకుండా శాసనసభ కాలపరిమితిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి వేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రెండు రోజుల్లో 15 పద్దులపై చర్చ ఎట్లా సాధ్యమని అధికార కాంగ్రెస్‌ను నిలదీశారు. బడ్జెట్‌పై చర్చను నాలుగు రోజులకే కుదిస్తున్నారన్నారు. సభ పదిహేను రోజులు నడపాలని స్పీకర్‌ను కోరామని వివరించారు.
నిరుద్యోగుల సమస్యపైన అసెంబ్లీలో బుధవారం చర్చ జరపాలని బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో స్పీకర్ ముందు ప్రతిపాదన పెట్టామని హరీశ్‌రావు తెలిపారు. సభ పదిహేను రోజులు నడపాలని సభాపతిని కోరామన్నారు. నిరుద్యోగుల మీద అక్రమకేసులు పెడుతున్న తీరు, జాబ్ క్యాలెండర్, గ్రూపు 2, 3పోస్టుల సంఖ్యను పెంచాలని దీనిపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరగాలని కోరామన్నారు.
రైతు రుణమాఫీపై చర్చ జరగాలని కోరాం : రైతు రుణమాఫీ చేస్తామని షరతులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంటలకు బోనస్, రైతు భరోసా, రుణమాఫీపై అసెంబ్లీలో చర్చజరగాలని కోరినట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆరు మాసాల్లో జరిగిన హత్యలు, అఘాయిత్యాల పైన చర్చ పెట్టాలని కోరినట్లు వివరించారు. స్థానిక సంస్థలను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామ పంచాయతీల నిధులపై చర్చించాలని కోరినట్లుగా వెల్లడించారు.
"గతంలో ఎప్పుడైనా బడ్జెట్‌పై 8నుంచి 10 రోజుల చర్చ జరిగేది. పద్దులపై 4 నుంచి 8 రోజులు చర్చించేవారు. కానీ ఈసారి రెండు రోజుల్లోనే పద్దులపై చర్చలు పెట్టాలని నిర్ణయించారు. రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలని అంటున్నారు. గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు 10 రోజులేనా బడ్జెట్ సమావేశాలు అని ప్రశ్నించేవారు"- హరీశ్‌రావు, మాజీ మంత్రి
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరే ఉచ్ఛరించలేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారు ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆయన పైవిధంగా స్పందించారు.
Harish Rao Fires On Kishan Reddy, Bandi : ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారన్న హరీశ్‌రావు తెలంగాణలో తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు జిల్లాలకు మొండి చేయి చూపారన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏమి చేస్తున్నట్లని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.