Ex Minister Jagadish Reddy Speak about Party Defections : పార్టీలకు అతీతంగా ఉంటామని చెప్పిన శాసనసభాపతి ప్రసాద్ కుమార్‌పై ఏం ఒత్తిళ్లు ఉన్నాయో చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అడిగారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్లపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు మంగళవారం నుంచి ప్రయత్నిస్తున్నామని అన్నారు. కానీ సభాపతి సమయం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆయన నుంచి స్పందన కరవైందని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ సభాపతి స్పందించకపోవడంతో ఈ-మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా అనర్హతా పిటిషన్‌ను ఆయనకు పంపామని చెప్పారు. శాసనసభాపతితో పాటు శాసనసభ కార్యదర్శికి కూడా పంపినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. స్పీకర్ చర్యల ఆధారంగా తమ తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చట్టప్రకారంగా, న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటామని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ చట్ట వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో చేరారని ధ్వజమెత్తారు.
Jagadish Reddy comments on BRS MLAs Join Congress : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇద్దరి సభ్యత్వాలు రద్దు కావాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. ఫిరాయింపుల చట్టానికి మరింత పదును పెడతామని లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మేనిఫెస్టో చూసి ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని ఆక్షేపించారు. ఫిరాయింపులు తగవని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బహిరంగంగానే మాట్లాడారని జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన చేష్టలతో పార్టీని బద్నాం చేస్తున్నారని చెప్తున్నారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ నాడు ఎవరినీ చేర్చుకోలేదని చట్ట ప్రకారం వారు విలీనం అయ్యారని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నాడు చట్ట ప్రకారం జరిగిందో లేదో అప్పటి సభాపతి పోచారం స్పందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ ఇళ్లకు వెళ్లి కండువా కప్పలేదని అన్నారు. కేసీఆర్‌ను నేతలు కలిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మోసం చేశారని గుర్తించిన ప్రజలు కేసీఆర్‌ను కలుస్తున్నారని చెప్పారు.