Indrakaran Reddy joins Congress : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి గాంధీభవన్ వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన దీపాదాస్ మున్షీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
గాంధీభవన్‌కు వచ్చే ముందుకు ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో దీపాదాస్ మున్షీ సమక్షంలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు దేవాదాయ, అటవీశాఖమంత్రిగా పనిచేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గత కొన్నిరోజులుగా ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ మారనున్నారని వదంతులు వచ్చినా ఆయన వాటిని ఖండించారు. ఎట్టకేలకు వదంతులను నిజం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలందరూ కాంగ్రెస్, బీజేపీలోకి క్యూ కట్టారు. వీరిలో గులాబీ పార్టీ ముఖ్యనేతలైన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కేకే, రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే.
సమ్మర్ ఎఫెక్ట్ - రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పొడిగించిన ఈసీ - Ec extend polling time