Amit Shah Video Morphing Case Update : కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు దిల్లీ పోలీసులు మరోసారి గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ లీగల్ సెల్ నాయకులతో మాట్లాడి నోటీసులు ఇస్తామన్న దిల్లీ పోలీసులు, లీగల్ సెల్ నాయకులు లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
అసలు ఏం జరిగిందంటే : గత నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభకు అమిత్ షా హాజరయ్యారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ మాటలను వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నట్లు వీడియో ఎడిట్ చేశారని కేంద్ర హోంశాఖ, బీజేపీ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమిత్ షా మాటలను వక్రీకరించి, ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే అభియోగంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఛైర్మన్ మన్నె సతీశ్, కో-ఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివ కుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు దిల్లీ పోలీసులు గత నెల 29న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్‌కు పంపించారు. ఈ నోటీసులు అందుకున్న నేతలు మే 1న విచారణకు హాజరు కాని పక్షంలో సీఆర్పీసీ 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. దిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం వారు ఏప్రిల్ 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. దీనిపై ఘాటుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాజాగా మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు దిల్లీ పోలీసులు నేడు మరోసారి గాంధీభవన్‌కు వచ్చారు.