CM YS Jagan reacted to AP election results : ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని సీఎం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేనిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేసినా, ఇలాంటి ఫలితాలు రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కచెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నానని తెలిపిన జగన్, పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసినా, ఓటమి పాలయ్యామని తెలిపారు. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశామని తెలిపారు. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నామని వెల్లడించారు. అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నామని తెలిపారు. వారందరి ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయామని పేర్కొన్నారు. పేదపిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశామన్నారు. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.