CM Revanth Corner Meeting in Patancheru : రాజ్యాంగం కల్పించిన హక్కులను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ యత్నిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం, 50 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు.
"ఇవాళ దేశం ఒక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమమో, అభివృద్ధినో ఎజెండాగా ముందుకు వెళ్లాయి. అలానే పేదరిక నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికలు జరిగాయి. కానీ మొదటిసారి 18వ పార్లమెంట్ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ బీజేపీ రద్దు చేయాలని కుట్రలు పన్నుతోంది."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
PCC Chief Revanth Reddy Election Campaign : ఈ పటాన్చెరు మినీ ఇండియా అని, దేశంలో ఎన్ని భాషలు, కులాలు ఉన్నాయో అందరూ ఇక్కడే కలిసి మెలిసి ఉన్నారని చెప్పుకొచ్చారు. మీకోసం మీ సమస్యలపై చట్ట సభల్లో మాట్లాడాలన్నా, దిల్లీలో నీలం మధును గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేసిందో, 2024 నుంచి 2034 వరకు అదే స్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందని తెలిపారు.
ఈసారి మెదక్ పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ కొత్తవాళ్లు కారన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులను పోలీసులతో తొక్కించిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి, కేసీఆర్, హరీశ్‌రావులకు రూ.వేల కొట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నా, ఎంపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు.
CM Revanth Comments on BJP : ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు తరచూ వస్తూనే ఉన్నారన్న ఆయన, పెద్దవాళ్లు వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో, పటాన్చెరు వరకు మెట్రో, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఇస్తారేమో అనుకున్నా కానీ ఇదేమీ ఇవ్వలేదన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే మనకు పెట్టుబడులు వస్తాయని, బీజేపీ మాత్రం గొడవలు పెట్టాలని చూస్తోందని సీఎం ఆరోపించారు.