Revanth and KCR Two Different Statements of One Topic : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్ది పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయి. అభ్యర్థులు మాటల తూటాలు పేల్చుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే వీరికి తోడుగా ప్రచారంలో పాల్గొనే నేతలు ఉపన్యాసాలతో అదరగొడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొసారి నాయకులు ఏదైనా ఒకే అంశంపై చేసే విమర్శలను పరిశీలిస్తే అంశం ఒకటే అయినా వారు వెల్లడించే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో పాటు ప్రజలను ఓకింత అయోమయానికి గురి చేస్తాయి.
Lok Sabha Elections 2024 : ఇటీవల ఏప్రిల్ 24న హనుమకొండ మడికొండలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి, గత ఆదివారం వరంగల్ రోడ్ షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే అంశంపై చేసిన విమర్శలు విభిన్నంగా ఉన్నాయి. విభజన హామీల్లో భాగంగా కాజీపేటకు వచ్చిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయలేదని ఇద్దరూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో ‘మన దగ్గర కోచ్ ఫ్యాక్టరీని పెట్టకుండా దాన్ని మహారాష్ట్ర లాతూర్‌కు తరలించుకుపోయారు’ అని పేర్కొన్నారు. కేసీఆర్ రోడ్డు షోలో మాట్లాడుతూ ‘మోదీ కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకెళ్లిపోయారు’ అని అన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ నెలకొల్పారనే సందేహం : ఈ నేపథ్యంలో అసలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ నెలకొల్పారనే సందేహం సహజంగా అందరికీ వస్తుంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ కోచ్ పరిశ్రమలు ఉండడం గమనార్హం. గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలో 1962లో పీరియాడిక్ ఓవరాలింగ్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. దీనిని 9,000ల అశ్వశక్తి (హెచ్‌పీ) సామర్థ్యం గల ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు తయారు చేసేలా ఉన్నతీకరిస్తూ గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.20,000ల కోట్లు. ప్రస్తుతం పనులు నడుస్తున్నాయి.
ఇక మహారాష్ట్ర లాతూర్‌లో ఈ సంవత్సరం మార్చిలో మరట్వాడా రైల్ కోచ్ పరిశ్రమను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారుచేయగల అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేశారు. 2026 నుంచి 2030 మధ్య సుమారు 120 వందేభారత్ రైళ్లను ఇక్కడి నుంచి తయారుచేసి రైల్వేశాఖకు అప్పగించే విధంగా ఒప్పందం జరిగింది. కాజీపేటలో పీవోహెచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రాజెక్టును గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేశారు. పీవోహెచ్ కన్నా కోచ్ ఫ్యాక్టరీ స్థాపిస్తే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఎన్నికల్లో దీన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి.
ఓవైపు బస్సుయాత్ర - మరోవైపు గులాబీ నేతలకు మార్గనిర్దేశం - బిజీబిజీగా కేసీఆర్ - KCR BUS Yatra Result