KTR Fires on Congress Over Medigadda Project Issue : కేసీఆర్ జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలని, తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుబట్టిన వారు ముక్కు నేలకు రాయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ ఆనకట్టలకు మరమ్మత్తులకు సంబంధించి ఎక్స్ వేదికగా ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
నిన్నటి దాకా, మేడిగడ్డ మేడిపండులా మారిందని, అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారని గుర్తు చేశారు. మరమ్మత్తులు చేసినా, ఇక పనికి రాదని, లక్ష కోట్లు బూడిదలో పోసిన పన్నీరని వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందని, అన్నారం ఆనకట్ట కూడా కూలిపోతుందని అన్నారని పేర్కొన్నారు. నేడు మాత్రం, మేడిగడ్డ మరమ్మత్తులు పూర్తి అంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారమని తేలిపోయిందని ఎక్స్ వేదికగా ఉద్ఘాటించారు.
నిన్నటి దాకా...
— KTR (@KTRBRS) July 1, 2024
మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు..
అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు.
మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు.
లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు.
వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు.
అన్నారం బ్యారేజీ కూడా కూలిపోతది అన్నారు.
నేడు మాత్రం..… pic.twitter.com/7FKOBsxzJ6
వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మినవారు లెంపలేసుకోవాలి : ఎనిమిది నెలల నుంచి చేసింది, కాలయాపనే అని రుజువైపోయిందన్న ఆయన, రిపేర్ల మాటున జరిగింది చిల్లర రాజకీయమని వెల్లడైపోయిందని పేర్కొన్నారు. ఇకనైనా కేసీఆర్ జలసంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలని, కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై కుట్రలు చేసిన వారు తప్పు ఒప్పుకోవాలని అన్నారు. తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును తప్పుబట్టిన వారు ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR Challenge to Congress Party : మరోవైపు జగిత్యాలలో నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, హస్తం పార్టీతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గడ్డిపోచలాంటి సంజయ్ పార్టీ ఫిరాయించాడే తప్ప గడ్డపారల్లాంటి కార్యకర్తలు ఉన్నారన్నారు. అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని కేటీఆర్ ఆరోపించారు.