BRS MLC Kavitha Dharna Today : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసుపై ఉన్న శ్రద్ధ ఆడబిడ్డల ఉద్యోగాలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళల ఉద్యోగాలు ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని రేవంత్ చూస్తున్నారని ఆక్షేపించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టారు.
మహిళలు లేనిదే సృష్టి, జీవితం ఏదీ లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేసే దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 1996లో పీవీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (Women Reservation Issue Telangana) వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లు తగ్గేలా ఉత్తర్వులు తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ హైకోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే, రేవంత్ ప్రభుత్వం మాత్రం హైకోర్టులో కేసు ఉపసంహరించుకుని ఆడబిడ్డలకు అన్యాయం చేసింది. - కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
MLC Kavitha Dharna Over Reservation Issue : గురుకుల ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు ఎన్ని వచ్చాయో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించాలని కవిత కోరారు. జీవో 3ను వెంటనే ఉపసంహరించుకొని హైకోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. జీవో 3 విషయంలో స్ట్రీట్ ఫైట్, లీగల్ ఫైట్ చేస్తామని తెలిపారు. ఫ్రీ జోన్ విషయంలో పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచినట్లే, ఆడబిడ్డలకు రిజర్వేషన్ల విషయంలో పోరాడతామని స్పష్టం చేశారు.
"కేసీఆర్ ఎవరినీ కలవరంటూ నిందించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), 90 రోజుల్లో ఎవరిని కలిశారు. రెండు రోజులకోసారి దిల్లీ వెళ్లి సోనియా ముందు హాజరు వేయించుకుంటున్నారు. సోనియా, ప్రియాంక పార్లమెంట్‌కు వెళ్లాలి. కానీ తెలంగాణ ఆడబిడ్డలు వంటింట్లో కుర్చోవాలా? రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి రైతులు మళ్లీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది." - కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
BRS Dharna On Women Reservation Issue : జై తెలంగాణ అనని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ఇంకా పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఆ తర్వాత వెంటాడతామని హెచ్చరించారు. సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీల సంతోషం కోసం సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట, రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు.