BRS Leader Vinod Kumar on CMs Meeting : రాష్ట్రంలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, రేపటి సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.
జమ్మూ, కశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారు కానీ, ఈ విజ్ఞప్తిపై స్పందించలేదని ఆరోపించారు. శాసనమండలిలో కనీసం 40 మంది, అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మూడో వంతు ఉండాలని, ఆంగ్లో ఇండియన్ కలిపితే రాష్ట్ర శాసనసభలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని వినోద్ వివరించారు. లోక్ సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించిందని, దీంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 మాత్రమేనని తెలిపారు.
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం : ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఇపుడు ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దు అవుతుందని ఆయన చెప్పారు. ఇపుడు మంచి అవకాశం వచ్చిందని, రేపటి సీఎంల సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సూచించారు. కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరిగేలా చూడాలని కోరారు.
తెలంగాణ ఆస్తులపై నిర్లక్ష్యపు వ్యవహారం తగదు.
— BRS Party (@BRSparty) July 5, 2024
గతంలో మన తెలంగాణ ఆస్తులపై సమైక్య నాయకులు కన్నేస్తే.. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం.
రేపు చంద్రబాబుతో జరిగే సమావేశంలో మన ఆస్తుల విషయంలో దయచేసి కాంప్రమైజ్ కావద్దని సీఎం రేవంత్‌కు మనవి చేస్తున్నా.
* మాజీ ఎంపీ @vinodboianpalli pic.twitter.com/fL61lEOLXv
"తెలంగాణ శాసనమండలికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. ఇది ఉత్పన్నమవటానికి ప్రధాన కారణం ప్రధాని మోదీ. ఆంగ్లో ఇండియన్స్‌ను తొలగించటం వల్ల ఇప్పుడు సమస్య ఏర్పడింది. ఎన్నికైన ఎమ్మెల్యేలు 119 సహా ఒక ఆంగ్లో ఇండియన్ కలిపి 120 మంది, అందులో మూడవ వంతు 40 సంఖ్య వల్ల లెజిస్లేటివ్ కౌన్సిల్ మన తెలంగాణకు విభజన చట్టం ద్వారా వచ్చింది. కానీ శాసనసభ్యుల సంఖ్య 119 వల్ల , శాసనమండలి రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంది."-వినోద్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
తెలంగాణ ఆస్తుల విషయంలో రాజీ పడొద్దు : తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వనరులపై ఏపీ వారు కన్నేశారన్న ఆయన, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని, తెలంగాణ ఆస్తులను పోగొట్టుకోరాదని సూచించారు. దిల్లీ తెలంగాణ భవన్ విభజనలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరగరాదని వినోద్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలపడంలో విఫలమయ్యారు : కేటీఆర్ - KTR Fires On Rahul Gandhi