BRS Leader Harish Rao Satires on CM Revanth : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు తెస్తామంటే ప్రజలు నమ్మి ఆగమయి మోసపోయారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా చందుర్తి మండలం మల్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీమంత్రి, కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు వచ్చేదన్నారు. హస్తం వచ్చాక కరెంటు కోతలతో మోటార్లు కాలుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ తెచ్చిన మార్పుతో కరెంటు కోతలు వచ్చాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్లు బంద్ అయ్యాయన్నారు. ఊర్లలో సాగునీళ్లు, తాగునీళ్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష వచ్చేదని, ఇప్పుడు అదికూడా బంద్ అయ్యి, తులం బంగారం ఇస్తామని ఎగబెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సిమెంట్, స్టీల్‌తో పాటు నిత్యావసర ధరలు పెరిగాయని అన్నారు.
"ఆరు గ్యారంటీలు, పదమూడు హామీలు మేము రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, మీ అందరికి బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. నూరు రోజులు పూర్తికాగానే ఇప్పుడు చేతులు ఎత్తేశారు. అడిగితేనేమో అధికారంలోకి వచ్చి ఐదు నెలలే కదా అయ్యింది. కొంత కాలం ఆగండని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు."-హరీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత
Harish Rao Fires on Congress Party : కాంగ్రెస్ పార్టీ వంద రూపాయల బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయన్న ఆయన, ఇప్పుడు సీఎం రేవంత్ మళ్లీ దేవుళ్లపై ఒట్లు వేయటం మొదలుపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని, నూట యాభై రోజులైనా అమలు చేయలేక చేతులెత్తేశారని అన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఇప్పుడు ఆగస్టు 15 తారీఖున చేస్తామని సీఎం అంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ గుడి దగ్గరకు పోతే ఆ దేవుడి మీద ఒట్లు వేసే ప్రోగ్రాం పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడగటానికి వస్తే మహాలక్ష్మి రూ.2500, రూ.4000 పెన్షన్ ఇచ్చాకనే ఓట్లకు రమ్మనాలి అన్నారు. వినోద్ కుమార్‌ను గెలిపిస్తే పార్లమెంట్లో గళమెత్తే గొంతవుతారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మే 9 వరకు రైతుభరోసా మిగిలిన డబ్బులు వేస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 11 సార్లు రూ.72000 కోట్ల రూపాయలు రైతులకు రైతుబంధు ఇచ్చారని చెప్పారు.
దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు : ప్రజలు తప్పిపోయి మళ్లీ కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే దొంగలకు సద్దికట్టినట్లు అవుతుందన్నారు. బండి సంజయ్ ఐదేళ్లలో ఏం చేశారని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీడీ కార్మికులకు బీజేపీ పీఎఫ్ పెన్షన్ రాకుండా చేశారని చెప్పారు. దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెడుతుందన్నారు. అదేవిధంగా మోదీ సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తుందన్నారు.