BRS Fires on MLA Sanjay inclusion in Congress : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఘాటువ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న వేళ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, చరిత్ర పునరావృతం అవుతుందని అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పదని పేర్కొన్నారు.
2004 నుంచి 2006 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయన్న కేటీఆర్, ప్రజా ఉద్యమం ఉద్ధృతం చేయడం ద్వారా తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించిందని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ తలవంచక తప్పలేదని గుర్తు చేశారు.
రాహుల్ మాటలకు విలువ లేకుండా చేస్తున్నారని ఎద్దేవా : ఫిరాయింపుల చట్టం తెస్తామన్న రాహుల్ గాంధీ మాటకు విలువ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఎల్.రమణ విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం అనైతిక చర్యగా అభివర్ణించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులు చేయాలని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కోరుతుంటే, ఇక్కడ మాత్రం సీఎం ఇళ్లకు వెళ్తూ కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు.
నయానో, భయానో గులాబీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటే బీఆర్ఎస్ భయపడబోదన్న ఆయన, ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కార్యకర్తల కష్టంతో గెలిచి ఇపుడు పార్టీ మారడం సిగ్గుచేటంటూ కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద గులాబీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసన చేస్తున్న క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
MLA Sanjay Kumar join in Congress : జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ కండువాపై గెలిచిన సంజయ్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. సంజయ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.