BJP Election Campaign in Telangana : రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో రోడ్ షోలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటివరకు అబద్దాలు అడేవారిలో నంబర్‌వన్ ఎవరంటే కెసీఆర్‌ను చూపించేవారని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువే ఉన్నారని విమర్శించారు. హామీలను నెరవేర్చకుండా మరోసారి అబద్ధాలతో ఓట్లు వేయించుకునేందుకు వస్తున్నారని ఆరోపించారు.
60 ఏళ్లలో జరగని అభివృద్ధిని గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపించారని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. దేశ అభివృద్ధి అలాగే కొనసాగాలంటే మరోసారి మోదీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఉగ్ర సంస్థలు బలపరుస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి జగిత్యాలలో కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
"ఉగ్రవాదులతో కాంగ్రెస్ వాళ్లు చేతులు కలుపుతున్నారు. మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఇస్లాం రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ద్వారా. దయచేసి గుర్తు పెట్టుకోండి. హిందువులందిరికి ఇది ముఖ్యమైన ఎన్నిక. యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చుకోవాలి. జనాభా నియంత్రణ చేసుకోవాలి. భారత దేశంలోని మనది హిందూ రాష్ట్రం కాబట్టే ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది." - అర్వింద్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి
మోదీ గ్యారంటీనే ఆయుధంగా చేసుకుని ప్రచారం : ఖమ్మంలో బీడేపీ మద్దతు ప్రకటించిన తర్వాత తొలిసారి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు భారీ ర్యాలీ చేపట్టారు. ఇచ్చే స్థానంలో మోదీ ఉంటారని తెచ్చే స్థానంలో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ మణికొండలో కార్యకర్తలతో బైక్‌ర్యాలీ చేపట్టిన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డిపై ఎన్నో భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని తెలిపారు.
ఎంఐఎం, కాంగ్రెస్‌కి ఓట్లు వేస్తే పాకిస్థాన్‌కి మద్దతు తెలిపినట్లేనని అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంకి లబ్ధి చేసేందుకే హైదరాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని బరిలో ఉంచిందని విమర్శించారు. మాధవీలతకు మద్దతుగా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకి మద్దతుగా ప్రచారం చేసిన నవనీత్‌కౌర్ హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఎస్టీ ఎస్సీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు పెంచుతందని ఆరోపించారు. ప్రచారానికి మరో రెండురోజులే ఉండటంతో ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయింది : కిషన్‌రెడ్డి - Kishan Reddy Comments on CM Revanth