Raghunandan Rao Slams CM Revanth Reddy : ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు మార్చడం సాధారణమే అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల వేళ ఏదైనా మాట్లాడతాం అంటే సరికాదన్నారు. ముదిరాజ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని రఘునందన్ సూచించారు. మోదీ మళ్లీ ప్రధాన మంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే మోదీకి ఇప్పుడు ఉన్న సీట్లు చాలవని, 400 స్థానాల్లో గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తీసుకోలేని కీలక నిర్ణయాలను మోదీ తీసుకున్నారన్నారు. యూపీఏ హయాంలో రోజుకు 7 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మిస్తే, తాము 35 నుంచి 37 కిలోమీటర్ల మేర నిర్మించామని అన్నారు. ఇది తమ వేగానికి నిదర్శనమని వివరించారు.
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో తాము దిల్లీ నుంచి రూపాయి పంపిస్తే గల్లీకి చేరుకునే సరికి రూ.15 పైసలు మాత్రమే అందుతుందని అన్నారని, అలాంటిది జరగకూడదని పారదర్శకంగా ఉండేలా మోదీ పేదలకు కూడా ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరిపించారని స్పష్టం చేశారు. అమీర్‌పేట్‌లోని ఓ హోటల్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటని, కాంగ్రెస్ వాళ్లలా తాము హామీలు ఇవ్వమని, నెరవేర్చే గ్యారంటీలనే ఇస్తామని తెలిపారు.
"దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమకారులను లాఠీ పట్టుకొని కొట్టారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్ వద్ద చేరి పదవులు అనుభవించారు. ఇప్పుడు అదే వ్యక్తి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి దోస్తీ లేదని, అధికారం ఉంచుకుంటారా లేదా అనేది ఆయన చూసుకోవాలి. తెలంగాణకు హాని చేసే వారు ఎవరైనా సరే పోరాడతాం. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి పది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం" - రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ అభ్యర్థి
రైతు రుణమాఫీకి - ఆగస్టు నెలకు సంబంధం ఏంటి : రఘునందన్ రావు - Raghunandan Rao Comments on CM
BJP MP Candidate Raghunandan Rao Comments : కాంగ్రెస్ పోలవరం ప్రాజెక్టుకు అప్పుడే జాతీయ హోదా ఇవ్వాల్సింది కదా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ పని చేయలేదని అయన ప్రశ్నించారు. 1980లో ఇందిరా గాంధీ మెదక్‌కు రైలు ఇస్తామని చెప్పారు కాని దాన్ని నిజం చేసింది మాత్రం ప్రధాని మోది మాత్రమే అన్నారు. నాకు గడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని అది నిజమయితే దాన్ని రాసి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా తానే పెట్టుకుంటానని చెప్పారు. బీసీ బిడ్డకు ఓటేయాలని ఇప్పుడు అంటున్నారు. ఆ బీసీ బిడ్డ ఇల్లును, తన ఇల్లును చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత గడి ఎవరిదో మీరే తేల్చండి అని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.
దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్‌లో ఎలా పోటీ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ అంటున్నారు, మరి కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ బస్సు వేసుకుని ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. గతంలో కొడంగల్‌లో రేవంత్‌ను ఓడిస్తే మల్కాజ్‌గిరికి వెళ్ళింది మరిచిపోయారా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో తనపై కుట్ర జరుగుతోందని అంటున్నారు. ఆయన కుడి, ఎడమ పక్కన ఉన్న వారితోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి తన సీటు కోసం కుట్ర జరుగుతోందని అంటున్నారని ఎద్దేవా చేశారు.
Raghunandan Rao Meet The Press : అదే నిజమైతే ఆయన డీజీపీని కలవొచ్చు కదా అని సూచించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో గెలిస్తే జరిగే పరిణామాలు రేవంత్‌కు బాగా తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టిన మెదక్ గడ్డపై బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనం అయిందన్నారు. కేసీఆర్ దారిలోనే రేవంత్ వెళ్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ కవల పిల్లలు అని రఘునందన్ రావు ఆరోపించారు. కవిత నిజామాబాద్‌లో ఓడిపోయినప్పుడు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారని, కరీంనగర్, సికింద్రాబాద్‌లలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. కానీ అక్కడ బీజేపీ ఎంపీలు గెలిచారన్నారు.
2015లో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ రేవంత్‌ను దేవుడు కూడా కాపాడలేడని అన్నారని కాని 2024 వరకు కూడా ఈ కేసులో ఎందుకు ముందడుగు పడలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఏ బంధం ఉందని ప్రశ్నించారు. వెంకట్రామి రెడ్డికి ఎందుకు ఓటేయాలని రైతులను మభ్య పెట్టినందుకు ఆయనకు ఓటు వేయలా? రైతుల భూములను లాక్కున్నందుకు ఓటు వేయాలా? అని మండిపడ్డారు. పటాన్ చెరువులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌ను ఓడించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చిందన్నారు.
పార్లమెంట్ నడుస్తున్న సమయంలో దేశం విడిచి పారిపోయిన రాహుల్ దేశం గురించి, ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారన్నారని తెలిపారు.గతంలో కేసీఆర్ సీఎంగా, హరీశ్, కేటీఆర్ మంత్రులుగా ఉన్న సమయంలోనే తాను దుబ్బాక గెలిచానని ఇప్పుడు మెదక్ పార్లమెంట్ గెలవడం ఇబ్బందిగా భావించడం లేదన్నారు. నీలం మధు, వెంకట్రామి రెడ్డికి భూములు దోచుకోవడం, కబ్జాలు చేయడం మాత్రమే తెలుసని వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారన్నారు. వెంకట్రామిరెడ్డి గెలిస్తే వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతారన్నారు.
దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పిదం వల్ల బీఆర్ఎస్ 10 ఏళ్లు బతికిందన్నారు. ఉద్యమ సమయంలో ఉన్న 50 ఏళ్ల కేసీఆర్ వేరు ఇప్పుడు ఉన్న 70 ఏళ్ల కేసీఆర్ వేరన్నారు. ఆయన కొత్త వంగడాలు కనిపెట్టి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేస్తే మంచిదని, తన ఫామ్ హౌస్‌ను పరిశోధన కేంద్రంగా మార్చాలని సూచించారు.