Bandi Sanjay Phone Tapping Case Comments : ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊసే లేదన్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ట్యాపింగ్ కేసును నీరుగార్చాయని విమర్శించారు. అనేక అంశాలపై సిట్‌లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని ఆక్షేపించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నం : ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చడంలో కరీంనగర్ మంత్రి హస్తం ఉందని అన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు చెప్పారని, ఆయన ఏం చెప్పారో పోలీసు రికార్డులో ఉందని తెలిపారు. పెద్దలు చెబితేనే తాము ఈ పని చేసినట్లు రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారని బండి సంజయ్ వెల్లడించారు.
"ఫోన్ ట్యాపింగ్‌లో నేను, రేవంత్‌రెడ్డి కూడా బాధితులమే. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోంది. నా కుటుంబసభ్యులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేశారు. 317 జీవో, టీఎస్‌పీఎస్సీ వివాదంలోనూ నా అరెస్టుకు ఫోన్ ట్యాపింగే కారణం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్‌రావు కూడా బాధితుడే. ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు కరీంనగర్ వాసి. అన్ని ఆర్థిక లావాదేవీలు నడిపింది ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావే." - బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ
గల్లీ నుంచి దిల్లీ వరకు డబ్బులు చేతులు మారాయి : కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న రాజేందర్‌రావు ఖర్చులన్నీ అశోక్‌రావే చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆయన ఇంట్లోనే రాజేందర్‌రావు ఉన్నారని అన్నారు. ప్రభాకర్‌రావు, అశోక్‌రావు ద్వారా కాంగ్రెస్ నేతలకు రూ.కోట్లు చేరాయని తెలిపారు. గల్లీ నుంచి దిల్లీ వరకు డబ్బులు చేతులు మారాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన డబ్బు ప్రభాకర్‌రావు హస్తం పార్టీకి ఇచ్చారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
"ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధం ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు మూసీ నదిలో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వాళ్లు. ఆ రెండు పార్టీలు గెలించినా ఫర్వాలేదు కానీ బండి సంజయ్ గెలవద్దని కోరుకుంటున్నారు. ఆరు గ్యారంటీలు, ఫోన్ ట్యాపింగ్‌పై ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది." - బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ
'నయీం కేసు, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసు లెక్కనే ఫోన్ ట్యాపింగ్‌ను నీరుగారుస్తున్నారు. మంత్రికి, కేసీఆర్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి?. కరీంనగర్‌కు చెందిన మంత్రి ద్వారా దిల్లీకి డబ్బులు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు ముడిపడిన అంశం. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి. సీబీఐకి ఇవ్వకపోతే ఈ కుంభకోణంతో హస్తం పార్టీ సంబంధం ఉన్నట్లే. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనుమానం కలుగుతుందని' బండి సంజయ్ ఆరోపించారు.