Raghunandan Rao on BRS MP Candidate Venkatrami Reddy : మల్లన్న సాగర్ ముంపు ప్రభావిత ప్రాంత ప్రజల పాలిట బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నరరూప రాక్షసుడని బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన అరాచకాలకు మల్లన్న సాగర్ ముంపు గ్రామ రైతు మల్లారెడ్డి తన చితిని తానే పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.
ఇవాళ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి, దుబ్బాక, అక్బర్పేట - భూంపల్లి మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులతో కలిసి రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలం పువ్వునకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పాశవిక హృదయంతో పది సంవత్సరాలు వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వహించి, ఇక్కడి ముంపు ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని రఘునందన్ రావు మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బతిమిలాడి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా పదవి చేపట్టారని రఘునందన్ రావు విమర్శించారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనూ ఆయన మెదక్ నియోజకవర్గ ప్రాంతాన్ని ఏనాడూ అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. మోసపూరితమైన వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు ఉన్నప్పుడు, ఇక్కడ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
100 కోట్లతో అభివృద్ది అంటూ మాయమాటలు : ఎన్నికల నేపథ్యం కావడంతో ఒక్కో ప్రాంతానికి రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తానంటూ వెంకట్రామిరెడ్డి మాయమాటలు చెబుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల నిర్మాణంలో నిర్వాసితులైన రైతులపై పోలీసులతో దాడి చేయించి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కాంట్రాక్టర్‌గా అవతారమెత్తి రూ.కోట్లు దండుకున్నారన్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసే విధంగా శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం ఫలించిందేమే అని ఎద్దేవా చేశారు. కానీ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అలాంటి నిర్ణయాలు ప్రజలు తీసుకోరని అన్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పేరిట ప్రజలను, రైతులను వంచించారు. అర్ధరాత్రి పోలీసులను పెట్టి గ్రామ ప్రజలను ఖాళీ చేయించారు. మల్లన్న సాగర్ పేరిట జరిగిన అరాచకాలు, దాడి వల్ల చివరకు మల్లారెడ్డి అనే ఓ రైతు తన చితిని తానే పేర్చుకొని, ఆ చితి మంటల మీద తానే ఆత్మహత్య చేసుకుంటే కూడా చలించని పాశవిక హృదయం వెంకట్రామిరెడ్డిది.' - రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ అభ్యర్థి
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదు : రఘునందన్ రావు