YS Sharmila Letter to CM Jagan : నవ సందేహాల పేరుతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరుసగా రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "ప్రభుత్వం వచ్చాక 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏమయింది? ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు అని ప్రశ్నించారు. జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదు? 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు. 22 ఎంపీలు ఇస్తే ఏం చేశారు?" అని ప్రశ్నించారు.
"గ్రూప్ 2 నోటిఫికేషన్ రెండు సార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఎందుకు అని నిలదీశారు.? విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెన్స్ ప్రొఫెసర్లు ఎందుకు భర్తీ చేయలేదన్నారు. 23 వేలతో మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు?" అని లేఖలో ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7శాతం పెరిగారు అంటే అది మీ వైఫల్యం కాదా? అని నిలదీశారు. ఉద్యోగాలు లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు? అని మండిపడ్డారు. జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు. ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా? స్కిల్ డెవలమెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఎందుకు నిలిపివేశారు? అని ఘాటుగా సీఎంకు జగన్‌కు రాసిన లేఖలో షర్మిల ప్రశ్నించారు.
బుధవారం జగన్‌కు షర్మిల లేఖ : సీఎం జగన్ను ప్రతిరోజూ అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల బుధవారం బహిరంగ లేఖ సంధించారు. నవ సందేహాలకు సమాధానం ఇవ్వండని డిమాండ్ చేశారు. "ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా ? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు ? 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు ? ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది ? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు ?
ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు ? ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా ? డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు ? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?" అంటూ లేఖలో ప్రశ్నలు సంంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎంను ఆమె డిమాండ్ చేశారు.
నవ సందేహాలకు సమాధానమివ్వండి - ఏపీ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల లేఖ - YS Sharmila Letter To CM Jagan