Amit Shah Telangana Tour Today : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024 : ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తరపున నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నాం 1:50 గంటలకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు మధ్యాహ్నాం 3:05 గంటలకు చేరుకోనున్నారు. ఆదిలాబాద్ కమలం పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోడెం నగేష్‌కు మద్దతుగా ఎస్పీఎం క్రికెట్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నాం 3:20 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 నిమిషాల పాటు సభలో ఆశీనులుకానున్నారు.
Lok Sabha Elections 2024 : కాగజ్‌నగర్‌లో సభ ముగించుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు అమిత్ షా చేరుకుంటారు. నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌కు మద్దతుగా గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సాయంత్రం 5:10 గంటల నుంచి సాయంత్రం 5:50 గంటల వరకు అమిత్ షా ఉండనున్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై ఉత్కంఠ : నిజామాబాద్ సభ ముగించుకున్నాక నేరుగా అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి రాత్రి 6:30 గంటలకు చేరుకోనున్నారు. రాత్రి 6:50 గంటల నుంచి రాత్రి 7:35 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనను ముగించుకుని రాత్రి 7:55 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బంగాల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ మూడు సభల్లో అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.
'రజాకార్ల నుంచి హైదరాబాద్ ముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించండి' - AMIT SHAH CAMPAIGN IN HYDERABAD