Why Rahul Contesting In Raebareli Seat : అనేక ఊహాగానాల తర్వాత నామినేషన్ల చివరి రోజున అమేఠీ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ, అమేఠీలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిశోరీ లాల్ శర్మను బరిలో నిలిపింది. ఈ నిర్ణయంపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీ, రాయ్‌బరేలీలో ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ పోటీ చేస్తారని ముందు నుంచీ పార్టీ మద్దతుదారులు ఊహించారు. వారికే టికెట్ కేటాయించాలని బహిరంగంగా ప్రదర్శనలు చేపట్టి ఒత్తిడి కూడా తీసుకొచ్చారు.
స్మృతి ఇరానీ గెలుపు ఈజీ!
అయితే ప్రియాంక మాత్రం పార్టీ అవసరాల దృష్ట్యా దేశవ్యాప్త ప్రచారానికే మొగ్గు చూపారు. అమేఠీలో ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోతుండటం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపు సులువు అవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. అన్నాచెల్లెలు పోటీ చేస్తే ఆ 2 స్థానాలే కాక సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపెట్టుకున్న మరో 15 నియోజకవర్గాల్లో విజయావకాశాలు దగ్గరయ్యేవని యూపీ కాంగ్రెస్ భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిష్ఠానం నిర్ణయం కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొన్నాయి.
బీజేపీకి అవకాశాలు ఇచ్చినట్లే!
అమేఠీలో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కిశోరీ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేతగా మంచి గుర్తింపు ఉంది. ఆయనకు నియోజకవర్గంతో గట్టి బంధం ఉన్నట్లు సమాచారం. అగ్రవర్ణాలు, గిరిజనులు, దళితులు, ముస్లింల నుంచి సంప్రదాయమద్దతును ఆయన తిరిగి కూడగట్టగలరన్న నమ్మకం పార్టీకి ఉన్నట్లు తెలిసింది. అయితే అమేఠీని విడిచిపెట్టడమనేది భారతీయ జనతాపార్టీకి గాంధీ కుటుంబాన్ని లక్ష్యం చేసుకునే దిశగా మరిన్ని అవకాశాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభల్లో రాహుల్‌గాంధీని విమర్శిస్తున్నారు. అమేఠీ నుంచి వయనాడ్‌కు ఇప్పుడు రాయ్‌బరేలీకి రాహుల్ వెళ్లారని ఎద్దేవా చేస్తున్నారు.
18సార్లు పోటీ చేస్తే ఏకంగా 15 సార్లు!
రాహుల్‌గాంధీ 2004 నుంచి వరుసగా 3 సార్లు అమేఠీ నియోజవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక్కడ 2014లో రాహుల్ ఓటు షేర్ 46 శాతం ఉండగా 2019కి అది 43 శాతానికి పడిపోయింది. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచి రాహుల్ పార్లమెంటులో అడుగుపెట్టారు. అమేఠీలో కాంగ్రెస్ 18సార్లు పోటీ చేస్తే ఏకంగా 15 సార్లు జయకేతనం ఎగరవేసింది. రాయ్‌బరేలీలో 20సార్లు బరిలో నిలబడ్డ కాంగ్రెస్ 17సార్లు విజయ ఢంకా మోగించింది. గత ఎన్నికల్లో సోనియా గాంధీ ఇక్కడ స్థిరంగా 55 నుంచి 56 శాతం ఓటు షేరింగ్‌ను సాధించారు.
సేఫ్ సీట్ ఎంచుకున్నారన్న ఆరోపణలు!
2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజవర్గం పరిధిలోని 5స్థానాల్లో కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీ కూటమి నాలుగింటిలో విజయం సాధించింది. అదే అమేఠీ విషయానికి వస్తే బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకోగా ఎస్పీ 2 చోట్ల గెలిచింది. 2 నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి బలమైన కోటలుగా ఉన్నప్పటికీ అమేఠీ కన్నా రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు మరింత పటిష్టంగా ఉందని దీనిని బట్టి తెలుస్తోంది. రాహుల్ అమేఠీ నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోతే, కాంగ్రెస్‌లో ఆయన పరిస్థితి బలహీనపడేదని, అందుకే భావోద్వేగ నిర్ణయం కాకుండా ఆచరణాత్మకంగా సురక్షితమైన సీటును ఎంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ రాహుల్‌కు ఏమాత్రం ప్రధాన పోటీదారుగా కనిపించడం లేదని సర్వేల ఆధారంగా స్పష్టమైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యాదవుల అడ్డాలో బీజేపీ గట్టి సవాల్- సమాజ్‌వాదీ కంచుకోటలో విజేత ఎవరో? - Lok Sabha Elections 2024