Key States In Lok Sabha Election 2024 : మహారాష్ట్ర, బిహార్, బంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అనే అంశం అంచనాలకు అందకుండా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అంటే లోక్‌సభలో ఉన్న మొత్తం స్థానాల్లో దాదాపు 25 శాతానికి సమానం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్‌లో 42 స్థానాలకుగాను బీజేపీ 18 చోట్ల, తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. 2014లో కాషాయ పార్టీ 17 శాతం ఓట్లు సాధించగా 2019 నాటికి దాన్ని 40 శాతానికి పెంచుకుంది. కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన ఓట్లు పెద్ద ఎత్తున కమలం పార్టీకి మళ్లాయి. ఏడు విడతల్లో జూన్ వరకు బంగాల్‌లో పోలింగ్ జరగనుండటం వల్ల ఏ పార్టీకి అధిక స్థానాలు వస్తాయో ఇప్పుడే అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగలేదని చెప్పారు. ఇవి మమత ఎన్నికలు కావని మోదీ ఎన్నికలని కొందరు అభిప్రాయపడ్డారు. బంగాల్‌లో ప్రతి స్థానంలో గట్టి పోటీ ఉంటుందని అన్నారు.
2019 కన్నా బీజేపీ రెండు సీట్లు అదనంగా సాధించినా లేదా తృణమూల్ కాంగ్రెస్ రెండు సీట్లు అదనంగా నెగ్గినా అది ఆయా పార్టీలకు పెద్ద విజయమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని, అయితే అది సీట్ల విషయంలో ప్రతిబింబిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిందని తెలిపారు. 2019లో బీజేపీకి మళ్లిన కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన ఓట్లు ఈసారి కూడా కాషాయ పార్టీకే పడతాయా లేదా అనేదే కీలకమని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మాదిరి కాషాయ పార్టీకి బంగాల్‌లో సంస్థాగత బలం లేదు. యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే వంటి కరిష్మా కలిగిన నేతలు బంగాల్‌లో లేకపోవడం కమలదళానికి ప్రతికూలాంశం. అయితే బంగాల్‌లో బీజేపీకే అధిక స్థానాలు వస్తాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో కాషాయ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.
బిహార్ ప్రజల మొగ్గు ఎటు వైపు?
మరో స్వింగ్ స్టేట్ బిహార్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 40 స్థానాలకు గాను 39 స్థానాలను బిహార్ ప్రజలు ఇచ్చారు. అయితే ఈసారి బిహారీలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అంచనా వేయడం కష్టమని సీనియర్ జర్నలిస్టు రోహిత్ సింగ్ తెలిపారు. నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల ఓటర్ల ఎటు వైపు మెుగ్గు చూపుతారో చెప్పడం కష్టమని పేర్కొన్నారు. 2020 శాసనసభ ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లిన నీతీశ్ కుమార్, 2022లో ఆర్జేడీతో జట్టు కట్టారు. తిరిగి 2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇలా వరుసగా కూటములు మార్చడం నీతీశ్ కుమార్‌పై వ్యతిరేకతను పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కులాల పరంగా చూస్తే బీజేపీ, జేడీయూ కూటమి బలంగానే ఉందని చెప్పారు. కుర్మీ కులానికి చెందిన నీతీశ్ కుమార్ ఆ వర్గం ఓట్లతో పాటు 36 శాతంగా ఉన్న ఇతర వెనకబడిన కులాల ఓటర్ల నుంచి మద్దతు పొందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 40 స్థానాల్లో ఇరు పార్టీలు 39 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు ఆర్జేడీలో అంతర్గత కుమ్ములాట ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నీతీశ్ కుమార్ బలపరీక్ష సమయంలో కొందరు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు. పప్పు యాదవ్‌కు ఇండియా కూటమి టికెట్ నిరాకరించడం వల్ల పూర్ణియా నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మహారాష్ట్రలో ఈసారి కష్టమే!
దేశంలో యూపీ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో 2014 నుంచి ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలనే రాబట్టింది. అయితే ఈసారి అత్యధిక స్థానాలు పొందడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయాలతో పాటు పార్టీలు మారాయి. 2019లో బీజేపీ, శివసేన ఉమ్మడిగా పోటీ చేసి 48 స్థానాల్లో 41 చోట్ల విజయం సాధించాయి. ఈసారి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే , NCP వ్యవస్థాపకులు శరద్ పవార్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలను రెండుగా చీల్చడం, గుర్తులను చేజిక్కించుకోవడం లాంటి విషయాలు బీజేపీ పట్ల వ్యతిరేకతను చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బీజేపీకు మద్దతు తెలపడం వల్ల ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. 2014లో ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన రాజ్ ఠాక్రే, ఆ తర్వాత ఆయనపై విమర్శలు చేశారు. మరాఠా రిజర్వేషన్లు కూడా ఈసారి కీలక పాత్ర పోషించనున్నాయి. మరాఠా వర్గానికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం ఏక్‌నాథ్ శిందే బిల్లును తీసుకొచ్చారు. అది బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ పరిణామాలన్నీ మహారాష్ట్రను స్వింగ్ స్టేట్‌గా మార్చాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కాశ్మీరంలో రాజకీయ వేడి- దిగ్గజ నేతల నడుమ టైట్ ఫైట్! - jammu kashmir lok sabha elections