Chitti Muthayala Mutton Dum Biryani Recipe : బిర్యానీ అనగానే మనలో చాలా మందికి గరం.. గరం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. కానీ, ప్రాంతాన్ని బట్టి ఈ బిర్యానీలో రకాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు మనం చిట్టిముత్యాలతో స్పైసీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా మటన్ బిర్యానీ చేస్తే ఆ ఘుమఘుమలతోనే సగం కడుపు నిండిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- మటన్ - అరకేజీ
- చిట్టిముత్యాల బియ్యం-3 కప్పులు
- నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు - 2
- టమాటాలు - 2
- యాలకలు - 7
- లవంగాలు - 10
- దాల్చిన చెక్క - 3 ఇంచ్‌లు
- షాజీరా - టేబుల్ స్పూన్
- అనాస పువ్వులు - 2
- బిర్యానీ ఆకులు - 3
- రాతి పువ్వు-కొద్దిగా
- రుచికి సరిపడా కారం
- పెరుగు - అర కప్పు
- జీడిపప్పు-పావు కప్పు
- జీలకర్రపొడి- టేబుల్ స్పూన్
- ధనియాల పొడి - టేబుల్ స్పూన్
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- గరం మసాలా - టేబుల్ స్పూన్
- పుదీనా, కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా బిర్యానీ కోసం.. చిట్టిముత్యాల బియ్యం శుభ్రంగా కడిగి ఒక గంటపాటు నానబెట్టుకోవాలి.
- ఆపై మటన్ శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు అడుగు మందంగా ఉండే బిర్యానీ గిన్నె స్టౌపై పెట్టండి. ఇందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. ఆపై నూనెలో దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు, అనాస పువ్వులు, షాజీరా, బిర్యానీ ఆకులు, రాతి పువ్వు వేసి కాసేపు వేపండి.
- అనంతరం జీడిపప్పులు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేపండి. ఇప్పుడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఆపై మటన్ వేసి మిక్స్ చేయండి.
- ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మటన్ 50 శాతం వరకు ఉడికించుకోండి.
- అనంతరం టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీన తరుగు, ఉప్పు వేసి ఫ్రై చేయండి.
- ఇప్పుడు జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి కలపండి. ఆపై పెరుగు వేసి మిక్స్ చేసి మూతపెట్టి ఉడికించుకోండి.
- మటన్‌లో ఆయిల్ పైకి తేలిన తర్వాత నానబెట్టుకున్న రైస్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలపాలి.
- రైస్‌లో చెమ్మ ఆరిన తర్వాత 6 కప్పుల వేడి నీరు పోసి మిక్స్ చేయండి. ఈ టైమ్‌లో బిర్యానీలోకి ఉప్పు, కారం టేస్ట్ చేసుకుని అవసరమైతే వేసుకోండి.
- తర్వాత గిన్నెపై మూతపెట్టండి. బిర్యానీ దమ్ చేయడానికి గిన్నెపై అల్యూమినియం ఫాయిల్ ఉంచి ఎర్రటి బొగ్గులు, కొబ్బరి పెంకులు వేయండి.
- మీ ఇంట్లో ఇవి లేకపోతే మామూలుగా బిర్యానీ దమ్ చేసుకోవచ్చు.
- బొగ్గుల మీద దమ్ చేసుకునే వారు ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్‌లో.. 8 నిమిషాలు లో ఫ్లేమ్‌లో దమ్ చేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోండి.
- మామూలుగా దమ్ చేసుకునేవారు ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్‌లో.. 12 నిమిషాలు లోఫ్లేమ్‌లో దమ్ చేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోండి. బిర్యానీ దమ్ చేసిన తర్వాత అరగంట పాటు అలా వదిలేయండి.
- అనంతరం బిర్యానీలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. అంతే ఇలా చేసుకుంటే ఘుమఘుమలాడే చిట్టిముత్యాల మటన్ దమ్ బిర్యానీ రెడీ. దీనిని వేడివేడిగా తింటుంటే టేస్ట్ అద్దిరిపోతుంది.
- నచ్చితే దమ్ బిర్యానీ ఓసారి ఇలా ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
మటన్ త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి - ఎంత ముదిరినా చక్కగా ఉడికిపోద్ది!
హైదరాబాద్ స్పెషల్ "మటన్ మలై హండి" - బగారా రైస్‌లోకి సూపర్ కాంబో!