United Nations on lebanon attack : హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని, దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా దాడుల నేపథ్యంలో యూఎన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
హానిచేయని పోర్టబుల్ వస్తువుల్లో ట్రాప్ ఉపకరణాలు వినియోగించడం సరికాదని యూఎన్ మానవహక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలిపారు. ఉద్దేశపూర్వకమైన హింసకు పాల్పడటం యుద్ధం కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఈ పేలుళ్ల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అన్నారు. ఈ ఘటనలు తనను కూడా ఎంతో భయాందోళనకు గురిచేశాయని వోల్కర్ వెల్లడించారు. ఈ దాడులు యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యూనికేషన్ సాధనాలను ఆయుధాలుగా మార్చడాన్ని వోల్కర్ తీవ్రంగా ఖండించారు.
'దౌత్యపరమైన పరిష్కారానికే ఇష్టపడుతున్నాం'
హెజ్బొల్లాలో వాకీటాకీల, పేజర్ల పేలుళ్ల ఘటనపై స్పందించేందుకు యూఎన్‌లోని ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ నిరాకరించారు. కానీ, లెబానాన్‌లోని హెజ్‌బొల్లాతో యుద్ధం చేయాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. ఈ దాడులను కొనసాగించలేమని డానన్ తెలిపారు. ఇజ్రాయెల్ దౌత్యపరమైన పరిష్కారాన్ని ఇష్టపడుతుందని, ఈ దాడులు తీవ్రతరం కాకుండా నిరోధించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రతీకార దాడులు
బీరుట్ దాడికి ముందు ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. గురువారం దక్షిణ లెబనాన్‌లోని వంద రాకెట్ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను యుద్ధ విమానాలతో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ వెల్లడించింది. అలాగే హెజ్‌బొల్లా స్థావరాలపైనా విరుచుకుపడినట్లు పేర్కొంది. ఈ దాడిలో హెజ్‌బొల్లా నం.2 ఇబ్రహీం అకీల్ హతం అయినట్లు తెలుస్తోంది. అకీల్తోపాటు మరో 12 మంది సీనియర్లు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అంతేకాదు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇబ్రహీం మృతిని హెజ్‌బొల్లా ఇంకా ధ్రువీకరించలేదు. కానీ ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా 140 రాకెట్లను ప్రయోగించింది.