Russia Fired ICBM On Ukraine : ఉక్రెయిన్‌పై మధ్యంతర శ్రేణి క్షిపణితో దాడి చేసినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీర్ఘ శ్రేణి క్షిపణులతో తమ దేశంపై దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిచ్చిన దేశాలపై సైతం ఈ క్షిపణిని ప్రయోగిస్తామని హెచ్చరించారు. గురువారం ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినట్లు పుతిన్ ఆ దేశవ్యాప్త టీవీ ప్రసంగంలో చెప్పారు. అమెరికా, బ్రిటన్ క్షిపణులతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ జరిపిన దాడులకు ఇది ప్రతిస్పందన అని పేర్కొన్నారు.
ఇతర దేశాలపై దాడులు చేసే ముందు రష్యా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని పుతిన్ చెప్పారు. రష్యా క్షిపణులను అడ్డగించే సామర్థ్యం అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థకు లేదని హెచ్చరించారు. డెనిప్రో నగరంపై రష్యా దళాలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణితో దాడులు చేసినట్లు ఇంతకుముందు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అయితే అది ఏ తరహా క్షిపణి అనేది వెల్లడించలేదు. మధ్యంతర క్షిపణితో రష్యా దాడి చేస్తుందని అమెరికా ముందుగానే అంచనా వేసింది.
ఇదిలా ఉండగా, రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని అగ్రరాజ్య ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది.
'ఐరోపాలో రష్యా చేసే విధ్వంసకర కార్యకలాపాలు యూఎస్‌కు చెందిన డిఫెన్స్ కంపెనీలను ప్రమాదంలో పడేశాయి. ఇటువంటి విధ్వంసకర పరిస్థితుల్లో భయం, సందేహాలు తలెత్తడం వల్ల పాటు మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తాయి. వాణిజ్యానికి అంతరాయం కలగడం లేదా మరణానికి కారణమవుతాయి' అని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికాలోని రక్షణ వ్యవస్థలు గల కంపెనీలు ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో కీవ్‌కు మద్దతినిచ్చే సంస్థలన్నీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరకలు జారీ చేసింది. అవి తమ రక్షణ వ్యవస్థను పెంచుకోవాలని సూచించింది.