Pakistan New Government 2024 : దాయాది దేశంలో మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్, బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నట్లు బిలావల్ భుట్టో ప్రకటించారు. ఒప్పందం ప్రకారం పీపీపీ కీలక నేత ఆసిఫ్ జర్దారీ పాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలో ఉన్న అంతర్గత సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.
పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న 265 జాతీయ శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అత్యధికంగా 93 స్థానాల్లో గెలుపొందారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం 133 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో 75 సీట్లు సాధించిన పీఎంఎల్ఎన్, 54 స్థానాల్లో నెగ్గిన పీపీపీ మధ్య పలుసార్లు చర్చలు జరిగినా అసంపూర్తిగానే ముగిశాయి. 17 సీట్లు కలిగిన మరో పార్టీ ఎంక్యూఎం-పీ వీరికి మద్దతు ఇవ్వడం వల్ల ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పీఎంఎల్ఎన్, పీపీపీ ప్రకటించాయి.
'నాకు ముందే తెలుసు'
అయితే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటనకు ముందు పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడుతుందని తాను ముందుగానే భావించినట్లు చెప్పారు. దేశాన్ని ఏ ఒక్క పార్టీ కూడా నడపలేదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నదే ప్రజల సందేశమని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి 11రోజులకు పైగా గడిచిందని, వాటి చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కాసేపటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేశారు.
'దేశ చరిత్రలో చీకటి అధ్యాయం'
మరోవైపు, 2018 సార్వత్రిక ఎన్నికలను పాకిస్థాన్ చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించింది పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ. దేశ ఎన్నికల చరిత్ర పరిపూర్ణంగా లేదని, కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. పార్లమెంట్ ఎగువ సభలో ఆ పార్టీ సెనేటర్ ఇర్ఫాన్ సిద్ధిఖీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'అది న్యాయమా?'
"2018లో నవాజ్ షరీఫ్ కటకటాల వెనుక ఉన్నారు. ఎన్నికల్లో ఆయనను పాల్గొనడానికి అనుమతించలేదు. అది న్యాయమా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలేవీ తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేదు. అసలు దేశ ఎన్నికల చరిత్రే సరిగ్గా లేదు. 2018 ఎన్నికల గురించి ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదు? అప్పట్లో చాలా జరిగాయి. ఈ ఏడాది కూడా అది జరిగి ఉండచ్చు" అంటూ సెనేటర్ ఇర్ఫాన్ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'పాక్ ఎన్నికలు- మదర్ ఆఫ్ ఆల్ రిగ్గింగ్'
పాకిస్థాన్ ఎన్నికల ప్రక్రియను మదర్ ఆఫ్ ఆల్ రిగ్గింగ్ అని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రజల తీర్పును దోచుకున్న నాయకులు దానిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పలు కేసుల్లో దోషిగా శిక్ష ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి అలీమా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఆమె ఇమ్రాన్ సందేశాన్ని తెలియజేశారు.
బాంబు పేలుళ్లు, కాల్పుల మధ్య పాక్‌లో ఎన్నికలు- నలుగురు మృతి- షరీఫ్‌కు పీఠం!
పాక్ మాజీ ప్రధానికి మరో షాక్- చట్టవిరుద్ధ వివాహం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష