Pak PM Sharif Raises Kashmir Issue At UN : ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై పాకిస్థాన్ మరోసారి విషం చిమ్మింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాలస్తీనా ప్రజల మాదిరిగానే కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్లు వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలని షహబాజ్ షరీఫ్ అన్నారు.
బుద్ధి మారలేదు!
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అందరూ గాజా యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటే, పాకిస్థాన్ మాత్రం ఎప్పట్లానే అసలు విషయాన్ని పక్కటపెట్టి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఆర్టికల్ 370 రద్దుపై పలు విమర్శలు చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. శుక్రవారం 79వ ఐరాస సర్వప్రతినిధి సభ సదస్సులో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసగించారు. ఎప్పట్లానే భారత్‌పై విషయం కక్కారు. 20 నిమిషాలపాటు సాగిన తన ప్రసంగంలో హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్వని, ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలను మాట్లాడారు. పాలస్తీనా సమస్యతో కశ్మీర్ అంశాన్ని పోల్చే ప్రయత్నం చేశారు. భారత్‌లో హిందూ ఆధిపత్య ఎజెండా నడుస్తోందని ఆయన విమర్శించారు. 20 కోట్ల మంది ముస్లింలను లొంగదీసుకోవాలన్న యత్నం జరుగుతోందని, ఇస్లాం చరిత్రను చెరిపివేసే కార్యక్రమం జరుగుతోందని అన్నారు.
ఎర్డోగాన్ నోట వినిపించని కశ్మీర్ మాట
మరోవైపు ఐరాస సమావేశాల్లో ఎప్పుడూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే తుర్కియే ఈసారి పూర్తిగా మౌనం వహించింది. 35 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ గాజాలోని మానవ సంక్షోభంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి విమర్శలు గుప్పించారు. కానీ ఎక్కడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. త్వరలో బ్రిక్స్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలోనే ఎర్డొగాన్, కశ్మీర్ అంశంపై మౌనం వహించినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వ్యవస్థాపక దేశాల్లో భారత్ ఒకటి అనే విషయం తెలిసిందే.