Nepal Landslide Today : నేపాల్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడడం వల్ల త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ నేపాల్ చిత్వాన్ జిల్లాలోని నారాయణ్ ఘాట్- ముగ్లింగ్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విరిగిపడిన కొండచరియలను తొలగించారు.
వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం
కాగా, త్రిశూలి నదిలో బస్సులు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల ఆచూకీ కోసం సిబ్బంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో కూడా గాలిస్తున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి రౌతహత్ గౌర్‌కు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. ఒక బస్సులో 24 మంది, మరో బస్సులో మిగతా వారు ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గణపతి డీలక్స్ బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాద సమయంలో వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు.
విచారం వ్యక్తం చేసిన నేపాల్ ప్రధాని
ఈ ఘటన పట్ల నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని రెస్క్యూ టీమ్, అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో కోరారు.
नारायणगढ-मुग्लिन सडकखण्डको सिमतालमा पहिरोले बस बगाउँदा झण्डै पाँच दर्जन यात्रु बेपत्ता एवं देशका विभिन्न भागमा बाढी पहिरोका कारण भएको धनजनको क्षतिप्रति गहिरो दुख व्यक्त गर्दछु। यात्रुहरूको खोजी एवं प्रभावकारी उद्धारका लागि गृह प्रशासन लगायत सरकारका सबै निकायलाई निर्देशित गर्दछु।
— ☭ Comrade Prachanda (@cmprachanda) July 12, 2024
ఘటనాస్థలికి పోలీసులు, సాయుధ బలగాలు
మరోవైపు, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి వెళ్లాయని పోలీసు సూపరింటెండెంట్ భావేశ్ రిమల్ తెలిపారు. నారాయణ్ ఘాట్- మగ్లింగ్ రోడ్డు సెక్షన్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాఠ్ మాండూ నుంచి చిత్వాన్‌లోని భరత్ పుర్‌కు వెళ్లే అన్ని విమానాలు శుక్రవారం రద్దయ్యాయి. కాగా, వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడడం, వరదలు కారణంగా గత దశాబ్ద కాలంలో నేపాల్‌లో దాదాపుగా 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 400 మంది గల్లంతవ్వగా, 1,500 మందికి పైగా గాయపడ్డారు.