Nepal Floods Landslides : నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 192కు పెరిగింది. 94 మంది గాయపడగా, మరో 30 మంది గల్లంతయ్యారు. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు, మధ్య నేపాల్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 4,500 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులకు ఆహారంతోపాటు ఇతర వస్తువులు అందించినట్లు చెప్పారు.
కొండ చరియలు విరిగిపడటం వల్ల శనివారం నుంచి జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా వందలమంది రోడ్లపై చిక్కుకుపోయారు. జాతీయ రహదారులపై రాకపోకలను పునరుద్ధరించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వరదలకు కాఠ్మాండూ లోయ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. అయితే గత 45 ఏళ్లల్లో ఇలాంటి స్థాయి వరదలు ఎన్నడూ చూడలేదని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ వరదల ఉద్ధృతి వల్ల భాగమతి నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోందని అన్నారు.
తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు, ఆర్మీ : ఇప్పటికే బస్సులు, వాహనాలు, ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి, శిథిలాల కింద చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు, బురద కింద ఇరుక్కున్న వాహనాలు, మృతదేహాలను వెలికితీసేందుకు నేపాల్ సైన్యం, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రంగంలోకి దిగిన పోలీసు, ఆర్మీ సహా ఇతర సహాయక సిబ్బంది వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ నేపాల్ వరదల ప్రభావం బిహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎందుకంటే అక్కడ నుంచి కొన్ని నదులు బిహార్‌లోకి ప్రవహిస్తాయి. కాబట్టి ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.