Kuwait Fire Accident : కువైట్‌లో భవన నిర్మాణ కార్మికులు నివాసముంటున్న భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్ కాలమాన ప్రకారం ఉదయం 4గంటల 30 నిమిషాల సమయంలో మంగాఫ్ నగరంలోని ఆరంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో చెలరేగిన మంటలు తర్వాత ఇతర అంతస్థులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 160మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వారిలో పదుల సంఖ్యలో కార్మికులు సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. అగ్నికీలల కారణంగా వెలువడిన పొగకు ఊపిరాడక ఎక్కువ మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో అనేక మంది భారతీయులు
భవనంలో ఎక్కువమంది భారతీయులే ఉండగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ భారత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన కువైట్ అంతరంగిక శాఖ మంత్రి, షేక్ ఫహద్ అల్-యూసుఫ్ అల్-సబా భవన యజమానిని అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు కువైట్ అగ్నిప్రమాద ఘటనలో గాయపడి అల్-అదన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 30మంది భారతీయుల్ని అక్కడి భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించారు. ఎంబసీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తర్వాత ఘటనాస్థలాన్ని కూడా పరిశీలించారు. బాధితుల సమాచారం ఇచ్చేందుకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు కూడా చేశారు.
మోదీ విచారం- అక్కడికి వెళ్లాలని మంత్రికి ఆదేశం
అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు.
ఇండియా, పాక్ మ్యాచ్‌పై ఆ ప్రశ్న అడగడమే పాపం- సెక్యూరిటీ చేతిలో యూట్యూబర్ బలి