Kamala Harris Future : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ వైదొలిగి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కమలనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థా? ఆమె నామినీగా కన్ఫామ్ అయినట్లేనా? కమలను అధ్యక్ష బరిలో దింపేందుకు డెమొక్రాట్లు అంగీకరిస్తారా? ఆమెకు పోటీగా ఉన్నది ఎవరు? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఆగస్టు 19-22 వరకు షికాగోలో డెమొక్రటిక్ జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పార్టీ ప్రతినిధుల ఆమోదాన్ని కమలా హారిస్ పొందితే, డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అవుతారు. ఇదే సమావేశంలో జో బైడెన్‌ను డెమొక్రాట్లు పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినీగా ప్రకటించాలనుకున్నారు. కానీ, బైడెన్ తడబాటుకు గురికావడం, ఆయన ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును ప్రసంగాల్లో సంబోధిస్తుండటం వంటి సంఘటనల నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ కారణంగానే చివరకు అధ్యక్ష బరి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో వచ్చే నెలలో జరిగే పార్టీ జాతీయ సదస్సుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష నామినీగా ఎవరుంటారని ఉత్కంఠ ఏర్పడింది. డెమొక్రటిక్ జాతీయ సదస్సులో 4,700 మంది పార్టీ ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్‌నకు పోటీగా అభ్యర్థిని నిలపనున్నారు.
అంత ఈజీ కాదు!
కమలా హారిస్‌కు జో బైడెన్ మద్దతు ప్రకటించినప్పుటికీ ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రట్ పార్టీ నామినీగా ఉండడం అంత సులువు కాదు. పార్టీ ప్రతినిధుల మద్దతును కూడగట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ సత్తా చాటారు. 3,896 మంది డెలిగేట్లను బైడెన్ గెల్చుకున్నారు. అయితే పార్టీ నియమాల ప్రకారం డెమొక్రాట్ నామినీగా మరో అభ్యర్థిని జో బైడెన్ నియమించలేరు. అయితే ఆయన మద్దతు రాజకీయంగా కొంతమేర ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది.
వారి మద్దతు కీలకం
జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నప్పటికీ కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల మద్దతు కూడగట్టడం చాలా కీలకం. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డెమొక్రాట్లలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. పార్టీ ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్ మర్ ఆమెకు ప్రధాన పోటీదారులుగా ఉంటారని భావిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది డెమొక్రాట్లు బహిరంగంగా కమలకు మద్దతు తెలిపారు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన మహిళ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే శ్వేతజాతీయులు అగ్రహానికి గురి కావచ్చే వాదనలు ఉన్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న న్యూసమ్, విట్ మర్ ఇద్దరు శ్వేతజాతీయులే.
ఒకవేళ అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రటిక్ పార్టీ తరఫున నామినీగా కమలా హారిస్ ఎంపికైతే, ఆమే తన రన్నింగ్ మేట్(ఉపాధ్యక్ష అభ్యర్థి)ని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. పార్టీ ప్రతినిధులు కూడా కమల నిర్ణయానికి మద్దతిస్తారు. అంతేకాకుండా, జో బైడెన్ వద్ద ఉన్న 91 మిలియన్ డాలర్ల క్యాంపెయిన్ ఫండ్, ఆమెకు ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఈ ఏడాది నవంబరు 5న జరగనుంది.
కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ - ఇంకా ఏమీ తేల్చని ఒబామా, పెలోసీ - Us Elections 2024
'ట్రంప్‌ను ఓడించడమే నా లక్ష్యం' - కమలా హారిస్ - US Elections 2024