Justin Trudeau On India : ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ చేసిన ఆరోపణలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం నిఘా సమాచారం ఆధారంగా భారత్‌పై ఆరోపణలు చేశానని, ఆ సమయంలో ఎటువంటి ఆధారాలు లేవని అంగీకరించారు. అయితే ఈ కేసులో తమ వద్ద విశ్వసనీయ ఆధారాలున్నాయంటూ కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందు తాజాగా మాట్లాడారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ నిర్వహిస్తున్న కమిటీకి ఆయన ఈ విషయాన్ని ధ్రువపరిచారు.
భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారుతో విభేదించే కెనడావారి వివరాలను ఇక్కడి భారత దౌత్యవేత్తలు సేకరించి, ఉన్నతస్థాయిలోని వారికి లారెన్స్ బిష్ణోయ్ వంటి నేరగాళ్ల ముఠాలకు చేరవేస్తున్నారని ట్రూడో ఆరోపించారు. "నిజ్జర్‌ను కెనడాలో హతమార్చడం వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. భారత్ ప్రమేయంతోనే హత్య జరిగిందనడానికి మేం నమ్మదగ్గ కారణాలు ఉన్నాయి. జవాబుదారీతనం ఉండాలని భారత ప్రభుత్వాన్ని వెంటనే సంప్రదించాం. తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూ భారత్ మాతో సహకరించేలా పనిచేశాం. భారత వర్గాలు మా నుంచి ఆధారాలు కోరాయి. అవి భారత భద్రతా బలగాల వద్దే ఉన్నాయనేది మా స్పందన. భారత్ మాత్రం ఆధారాలు చూపాలని పట్టుబట్టింది. రెండు దేశాలు కలిసి పనిచేసి వాటిని సాధించవచ్చని చెప్పాం" అని చెప్పారు.
అయితే కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారని, వారిని అరెస్టు చేయాలని ప్రధాని మోదీ తనతో చెప్పారని అన్నారు. అయితే, తమను విమర్శించే ధోరణి భారత్ అవలంబిస్తోందన్న విషయం జీ20 నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత అర్థమైందని వ్యాఖ్యానించారు.
మరోవైపు, భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీలోనే నిరసన సెగ తగులుతోంది. ఆయన నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీకి ట్రూడో రాజీనామా చేయాలని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎంపీ బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికే ఆయన్ను చాలా భరించారని వ్యాఖ్యానించారు. భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం ముదిరిన వేళ ఈ కీలక పరిణామం జరగడం గమనార్హం.