Israel Attack Rafah Today : రఫాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 44 మంది మరణించారు. మృతుల్లో 3 నెలల చిన్నారి సహా 12 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు సమాచారం. రఫాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆదేశించిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం.
మరోవైపు ఖాన్ యూనిస్‌లోని ఓ ఆస్పత్రిపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒక వ్యక్తి చనిపోగా పలువురు గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-కిద్రా తెలిపారు. అయితే ఆస్పత్రిలో మంటలు చెలరేగుతుండటం వల్ల వైద్య సిబ్బందికి చికిత్స చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వెల్లడించారు. ఖాన్ యూనిస్ ఆస్పత్రిలో దాదాపు 300 మంది వైద్య సిబ్బంది, 450 మంది రోగులు, 10 వేల మంది నిరాశ్రయులు ఉన్నట్లు సమాచారం.
ఆస్పత్రి ధ్వంసం
అంతకుముందు రఫాపై గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మొదటి దాడిలో స్థానిక కువైట్ ఆసుపత్రి సమీపంలోని ఓ భవనం ధ్వంసమైంది. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వారిలో ముగ్గురు చిన్నారులు సహా ఒక మహిళ ఉన్నారు. మరో వైమానిక దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. సెంట్రల్ గాజాలో నిరాశ్రయులైన వారి కోసం ఏర్పాటు చేసిన శిబిరంపై జరిగిన ఇంకో దాడిలో నలుగురు పౌరులు మరణించారు. 30 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. దాడి జరిగే సమయంలో వారంతా నిద్రిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సాధారణ పౌరుల మరణాలు రోజురోజుకూ పెరిగిపోతుండటంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే ఇజ్రాయెల్ వరుసగా గాజాపై దాడులతో విరుచుకుపడుతుండటం వల్ల అమెరికాతో సంబంధాల్లో చీలిక ఏర్పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం మొదలై నాలుగు నెలల వ్యవధిలో గాజాలో మృతుల సంఖ్య దాదాపు 28 వేలకు చేరింది. దీంతో ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
135 రోజులపాటు కాల్పుల విరమణ ప్రతిపాదన- తగ్గేదేలే అన్న నెతన్యాహు
'పూర్తి కాల్పుల విరమణ పాటిస్తే బందీల విడుదలకు రెడీ'- స్పష్టం చేసిన హమాస్